తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Farmers Jac Protest In Delhi Jantar Manar For Amaravati Capital For Andhra Pradesh

Amaravati Struggle : ఢిల్లీలో అమరావతి రైతుల పోరాటం…..

HT Telugu Desk HT Telugu

18 December 2022, 8:35 IST

    • Amaravati Struggle ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ  రాజధానికి భూములిచ్చిన రైతులు మూడేళ్లుగా చేస్తోన్న పోరాటం  ఢిల్లీకి చేరింది. దేశ రాజధానిలో అమరావతి ప్రాంత రైతులు ఆందోళన చేపట్టారు.  రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని కొనసాగించాలంటూ  విజయవాడ నుంచి తరలి వెళ్లిన ఆందోళనకారులు నిరసనలు తెలుపుతున్నారు. 
ఢిల్లీ జంతర్‌మంతర్‌లో  ఆందోళన చేస్తున్న అమరావతి రైతులు
ఢిల్లీ జంతర్‌మంతర్‌లో ఆందోళన చేస్తున్న అమరావతి రైతులు

ఢిల్లీ జంతర్‌మంతర్‌లో ఆందోళన చేస్తున్న అమరావతి రైతులు

Amaravati Struggle అమరావతిని ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా కొనసాగించాలనే డిమాండ్‌తో అమరావతి రాజధాని సాధన సమితి రైతులు ఢిల్లీలో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. జై అమరావతి..జై ఆంధ్రప్రదేశ్‌ అంటూ దేశ రాజధానిలో ఆందోళన చేపట్టారు. రాజధానిగా అమరావతే కొనసాగాలని ఆందోళనకారులు నినాదాలు చేశారు. 'ధరణి కోట నుంచి ఎర్ర కోటకు' పేరుతో అమరావతి రైతులు కదం తొక్కారు. రైతులను కంటతడి పెట్టించిన వారెవ్వరూ చరిత్రలో బాగుపడలేదని రైతులు అక్రోశించారు.

అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద పార్లమెంట్‌ మార్చ్‌ నిర్వహించారు. జేఏసీ ఆందోళనకు సిపిఎం, సిపిఐ, టిడిపి, కాంగ్రెస్‌, జనసేన తదితర పార్టీల నేతలు సంఘీభావం తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షాకు జేఏసీ నాయకులు లేఖలు రాశారు. అమరావతి రైతు ఉద్యమం, రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి ఫోటో ఎగ్జిబిషన్‌‌ను ప్రదర్శించారు.

అమరావతిని నిర్మించాలని, ఆంధ్రప్రదేశ్‌ను రక్షించాలని మోడీ, అమిత్‌ షాకు విజ్ఞప్తి చేస్తూ ప్లకార్డులను రైతులు చేబూని నినాదాల హౌరెత్తించారు. జంతర్‌మంతర్‌ అంతా ఆకుపచ్చ కండువాలతో హరితవర్ణమైంది. రైతుల ఆందోళనలకు మద్దతు ఇచ్చిన సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా మాట్లాడుతూ రాజధాని రైతుల డిమాండ్‌కు తమ పార్టీ మద్దతు ఉందని స్పష్టం చేశారు. ఏపిలో చాలా తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నెలకొందని, కేంద్రం నుంచి ఏపికి రావల్సిన నిధులు రావటం లేదని ఆరోపించారు. రాజధాని సమస్యను కొనసాగించే ధోరణిని వైఎస్‌ జగన్‌ విడనాడాలని హితవు పలికారు. అమరావతి రాజధానిగా కొనసాగుతోందని సిఎం జగన్మోహన్‌ రెడ్డి ప్రకటించి, ఈ సంక్షోభానికి ముగింపు పలకాలని సూచించారు. లేకపోతే డిమాండ్‌ సాధన కోసం తామంతా ఐక్యంగా పోరాడుతామని హెచ్చరించారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధాని మారదు : అరుణ్‌

ప్రతికూల వాతావరణంలోనూ ఢిల్లీలో ఆందోళన చేస్తున్నా రైతుల డిమాండ్లకు తమ పార్టీ మద్దతు ఉంటుందని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు అరుణ్‌ కుమార్‌ ప్రకటించారు. రాజధాని నిర్మాణానికి మట్టి, నీరును తెచ్చి ఇచ్చారని, దేశానికి ఒక చిహ్నంగా ఉండే బ్రహ్మాండమైన రాజధానిని నిర్మిస్తారని అంతా అనుకున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అటు విభజన హామీలను నేరవేర్చకుండా మోసం చేసి.. రాజధాని విషయంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ద్రోహం చేస్తోందన్నారు. రాజధానిని ఒకసారే నిర్ణయిస్తారని, ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మారడం సరైనది కాదని పేర్కొన్నారు.

మాజీ కేంద్ర మంత్రి జెడి శీలం మాట్లాడుతూ అమరావతి విషయంలో బిజెపి డ్రామాలాడొద్దని, చిత్తశుద్ధి ఉంటే చెప్పేది చేయాలని హితవు పలికారు. ఇచ్చిన హామీలపై కట్టుబడి ఉండాలని, అబద్ధాలు చెప్పొదని సూచించారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు పసుపులేటి హరిప్రసాద్‌ మాట్లాడుతూ రైతుల కంటతడి పెట్టించిన ఏ నాయకుడు బాగుపడినట్లు చరిత్రలో లేదని అన్నారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని తమ వైఖరి అని, రాజధానిని చీల్చాలనే పార్టీని కూల్చాలని పిలుపు ఇచ్చారు.

బిఎస్‌పి ఎంపి డానిష్‌ అలీ మాట్లాడుతూ అమరావతికి భూమి పూజ చేసిన ప్రధాని మోడీ, ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. అమరావతి రైతులకు న్యాయం ఎవరు చేస్తారని ప్రశ్నించారు. రైతులకు కలలు చూపించారని, ఆ కలలను ధ్వంసం చేస్తున్నారని విమర్శించారు. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత ఒక్కటే కాదని, కేంద్రానిది కూడా బాధ్యత ఉందని స్పష్టం చేశారు.

కేంద్రం జోక్యం చేసుకోవాలన్న ఎంపీ శివదాసన్‌

అమరావతి రాజధానిగా వైఎస్‌ జగన్‌ ప్రతిపక్షనేతగా మద్దతు ఇచ్చారని, కానీ సిఎంగా ఎన్నికైన తరువాత తన వైఖరి మారిందని విమర్శించారు. ఇది పూర్తిగా రైతులను మోసం చేయడమేనని సిపిఎం ఎంపి వి.శివదాసన్‌ అన్నారు. వేలాది మంది రైతులు అమరావతి రాజధాని నిర్మాణానికి భూములను ఇచ్చారని, కానీ ప్రస్తుత ప్రభుత్వం దానికనుగుణంగా చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. సిపిఐ ఎంపి సంతోష్‌ కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మత, ప్రాంతాలు వారీగా ప్రజలను విడగొడుతోందని విమర్శించారు. అమరావతిని రాజధానిగా కొనసాగించడం చారిత్రాత్మక అవసరమని, మూడు రాజధానుల వైఖరి ఆపాలని డిమాండ్‌ సూచించారు.

రాజధాని కోసం రైతులు చేస్తోన్న ఉద్యమం మూడేళ్లుగా జరుగుతోందన్నారు. అమరావతిని నాశనం చేయాలని సిఎం వైఎస్‌ జగన్‌ కంకణం కట్టుకున్నారని ఎంపీ రామ్మోహన్‌ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయస్థానాలు కూడా రాజధాని రైతులవైపే న్యాయం ఉందని చెప్పాయని అన్నారు. ఎంపి రఘురామకృష్ణ రాజు మాట్లాడుతూ రైతులను వైసిపి ప్రభుత్వం దగా, మోసం చేసిందని, అమరావతిలో 80 శాతం చిన్న, సన్నకారు ఎస్‌, బిసి రైతులే ఉన్నారని తెలిపారు. టిడిపి ఎంపిలు గల్లా జయదేవ్‌, కనకమేడల రవీంద్ర కుమార్‌, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, మాజీ ఎంపి అజీజ్‌ భాషా, ఏపిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తదితరులు రైతులకు సంఘీభావం ప్రకటించారు.