Vijayawada : యువతితో వివాహేతర సంబంధం.. ఆమె తల్లి, సోదరుడిపై బ్లేడ్‌తో దాడి
29 October 2024, 9:18 IST
- Vijayawada : విజయవాడలో దారుణ ఘటన జరిగింది. యువతితో వివాహేతర సంబంధం పెట్టుకుని, ఆమె తల్లి, సోదరుడిపై నిందితుడు విచక్షణా రహితంగా బ్లేడ్‌తో దాడి చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. అతని పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
బ్లేడ్‌తో దాడి
విజయవాడలోని వాంబే కాలనీలో దారుణం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. వాంబే కాలనీకి చెందిన గుంటు రమేష్ స్థానికంగా ఉండే ఓ యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె భర్త రెండేళ్ల క్రితమే చనిపోగా.. అప్పటి నుంచి రమేష్‌తో కలిసి ఉంటోంది. ఈ క్రమంలోనే యువతి తల్లితో పలుమార్లు గొడవపడి ఆమెపై దాడి చేశాడు. ఈసారి గొడవపడి బ్లేడ్‌తో ముఖంపై దాడి చేశాడు. ఆమె కుమారుడు, యువతి సోదరుడు ప్రశ్నించగా అతడిపై కూడా రమేష్ దాడి చేశాడు.
నగరంలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో రమేష్‌పై కేసులు ఉన్నాయి. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో గుంటు రమేష్, యువతి తల్లి ఇంటికి వచ్చి గొడవ పడ్డాడు. దీంతో గడ్డం గీసుకునే బ్లేడ్‌తో ఆమెను చంపబోయాడు. ఆ సమయంలో పక్కింట్లో ఉన్న యువతి అడ్డు రాగా ఆమెపై కూడా దాడి చేసి గాయపరిచి పారిపోయాడు. ఆదివారం రాత్రి 9 గంటల నున్న పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి యువతి తల్లి ఫిర్యాదు చేసింది. నిందితుడు గుంటు రమేష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న అతడిని పట్టుకుని విచారణ జరుపుతామని పోలీసులు వివరించారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం..
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయిన బాలికను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని బాలిక తల్లిదండ్రులను అడిగాడు ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అందుకు బాలిక తల్లిదండ్రులు నిరాకరించారు. తమ కుమార్తెకు అప్పుడే పెళ్లి చేయబోమని అన్నారు. దీంతో బాలికను ఆ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కిడ్నాప్ చేశాడు.
ఈ ఘటన కృష్ణా జిల్లా పెనమలూరులోని తాడిగడపలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. తాడిగడపకు చెందిన ఓ బాలిక (14)కు నాలుగు నెలల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో గుంటూరు జిల్లా గురజాల గ్రామానికి చెందిన కన్నెగంటి సంపత్ కుమార్‌తో పరిచయం ఏర్పడింది. ఇతను నెల కిందట బాలిక ఇంటికి వెళ్లాడు. తాను గూగుల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నానని.. బాలిక కుటుంబ సభ్యులకు పరిచయం చేసుకున్నాడు. తాను బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని బాలిక తల్లిదండ్రులను అడిగాడు.
అందుకు బాలిక తల్లిదండ్రులు విముఖత వ్యక్తం చేశారు. తమ కుమార్తెకు కొంతకాలం వరకూ వివాహం చేయడానికి సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. దీంతో అతడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈనెల 25న తల్లిదండ్రులు కుమార్తెను తమ కుమారుడుతో షాపింగ్‌కు పంపించారు. అక్కడకు సంపత్ కుమార్ కారులో వచ్చి బాలికను ఎక్కించుకొని వెళ్లిపోయాడు. సమాచారం తెలసుకున్న కుటుంబ సభ్యులు కుమార్తె సెల్‌ఫోన్‌కు ఫోన్ చేయగా అది పని చేయలేదు. దీంతో సోమవారం పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంపత్ కుమార్‌పై కిడ్నాప్ చేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)