తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Alla Nani Resign : వైసీపీకి షాక్.... మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని రాజీనామా

Alla Nani Resign : వైసీపీకి షాక్.... మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని రాజీనామా

Published Aug 09, 2024 02:50 PM IST

google News
    • Ex Minister Alla Nani Resign : వైసీపీకి మరో షాక్‌ తగిలింది.  మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని రాజీనామా చేశారు. ఏలూరు జిల్లా అధ్యక్ష పదవితో పాటు అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పార్టీ అధినేత జగన్ కు లేఖను పంపారు.
వైసీపీ అధినేత జగన్ తో ఆళ్ల నాని (ఫైల్ ఫొటో)

వైసీపీ అధినేత జగన్ తో ఆళ్ల నాని (ఫైల్ ఫొటో)

Ex minister Alla Nani Resign : అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా మాజీ ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని (కాళీకృష్ణ శ్రీనివాస్‌) రాజీనామా చేశారు. ఏలూరు జిల్లా అధ్యక్ష పదవితో పాటు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.


వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు నాని తన లేఖలో వెల్లడించారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్‌కు పంపించారు. గత ప్రభుత్వం నాని…. డిప్యూటీ సీఎం పదవితో పాటు వైద్యారోగ్యశాఖ  మంత్రిగా పనిచేశారు. 

ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆళ్ల నాని 2004లో గెలిచారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లోనూ విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్ ను వీడి... జగన్ తో నడిచారు. 2014 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన కోటా రామారావు విజయం సాధించారు.

ఇక 2019 ఎన్నికల్లో ఆళ్ల నాని గెలిచారు. రాష్ట్రంలో వైసీపీ కూడా అధికారంలోకి రావటంతో ఆయన్ను మంత్రి పదవి వరించింది. వైద్యారోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇదే సమయంలో ఆయన్ను డిప్యూటీ సీఎంగా నియమించారు. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏలూరు నంచే పోటీ చేసిన నాని... ఓటమిపాలయ్యారు. టీడీపీ తరపున పోటీ చేసిన రాధాకృష్ణయ్య విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో 62 వేల ఓట్ల తేడాతో ఆళ్ల నాని ఓడిపోయారు.

ఎన్నికల్లో ఓటమి తర్వాత... పార్టీ కార్యక్రమాలకు కూడా ఆళ్ల నాని దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

ఇటీవలే మాజీ ఎమ్మెల్యే దొరబాబు రాజీనామా

అధికారం కోల్పోయిన తర్వాత చాలా మంది నేతలు వైసీపీని వీడుతున్నారు. ఇప్పటికే పలువురు మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు కండువాలు మార్చే పనిలో పడ్డారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు రాజీనామా చేశారు. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం కూటమితో కలిసి పనిచేస్తానని వెల్లడించారు. 

 పిఠాపురం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు… మొన్నటి ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఈ ఎన్నికల్లో వంగా గీతకు వైసీపీ అవకాశం ఇచ్చింది.మొన్నటి వరకు పార్టీకి దూరంగా ఉన్న దొరబాబు… తాజాగా వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఏ పార్టీలో చేరే విషయంపై త్వరలోనే ప్రకటన చేస్తానని తెలిపారు.

అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో జగన్ నేతృత్వంలోని ఫ్యాన్ పార్టీ ఘోరంగా ఓటమిపాలైంది. కూటమి బంపర్ విక్టరీ కొట్టడంతో… వైసీపీ నేతలు డైలామాలో పడిపోయారు. అయితే క్షేత్రస్థాయిలోని పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు మాత్రం… కూటమిలో ఉన్న పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవలే విశాఖ నగరానికి చెందిన పలువురు కార్పొరేటర్లు జనసేనలో చేరారు. రాబోయే రోజుల్లో మరిన్ని చేరికలు ఉండే అవకాశం ఉందన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.