AP Pensions: భారీ వర్షంలోనూ కొనసాగుతున్న ఫించన్ల పంపిణీ
31 August 2024, 14:35 IST
- AP Pensions: ఓవైపు భారీ వర్షం.. మరోవైపు ఫించన్ల పంపిణీ.. అవును ఏపీలో ఇప్పుడు కనిపిస్తున్న దృశ్యాలు ఇవి. భారీ వర్షంలోనూ ఏపీలో ఫించన్ల పంపిణీ కొనసాగుతోంది. ఆదివారం సెలవు కావడంతో.. శనివారం ఫించన్ల పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో వర్షంలోనూ పంపిణీ చేస్తున్నారు.
ఫించన్ల పంపిణీ చేస్తున్న సిబ్బంది
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షంలోనూ ఎన్టీఆర్ భరోసా ఫించన్ల పంపిణీ కొనసాగుతుంది. వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు ఇబ్బంది పడకుండా.. సీఎం చంద్రబాబు ఆదేశాలతో నేరుగా లబ్దిదారుల ఇళ్లకే వెళ్లి ఫించన్ల పంపిణీ చేస్తున్నారు. ఆదివారం సెలవు కావడంతో.. లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా ఒక రోజు ముందే ఫించన్ల పంపిణీకి చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. ఇంత భారీ వర్షంలోనూ ఉదయం 9 గంటల సమయానికి, 62 శాతం ఫించన్ల పంపిణీ పూర్తయింది.
ఒక్క రోజులోనే..
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 65,18,496 మంది ఫించనుదారులు అందరికీ.. పెంచిన ఫించన్లను ఒక్క రోజులోనే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేయించాలని సీఎం ఆదేశించారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు.. వృద్దులు, వితంతువులు తదితర 11 ఉప కేటగిరీలకు చెందిన వారి ఫించను సొమ్మును రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచి జూలై 1 వ తేదీ నుంచి చెల్లిస్తున్నారు.
కేటగిరీల వారీగా..
రెండో కేటగిరీలోని పాక్షిక దివ్యాంగులకు రూ.3 వేల నుంచి రూ.6 వేలకు, మూడో కేటగిరీలోని పూర్తి స్థాయి దివ్యాంగులకు రూ.5 వేల నుంచి రూ.15 వేలు, నాల్గో కేటగిరీలోని కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఝకాలిక వ్యాధులతో బాధపడేవారికి రూ.5 వేల నుంచి 10 వేలకు ఫించను సొమ్ము పెంచిన విధంగా పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. మిగిలిన ఐదో కేటగిరీలోని వారికి గతంలో లాగానే ఎటువంటి మార్పు లేకుండా యాధావిధిగా ఫించను సొమ్మును పంపిణీ చేయాలన్నారు.
ముందే డబ్బులు డ్రా చేయాలి..
ఇళ్ల వద్ద పంపిణీ చేయాల్సిన ఫించను సొమ్మును 31 వ తేదీ శుక్రవారమే సంబంధిత బ్యాంకు బ్రాంచ్‌ల నుంచి డ్రా చేసుకుని సిద్దంగా ఉంచుకోవాలని అధికారులు సిబ్బందిని ఆదేశించారు. ఉదయం 6 గంటల నుంచి ఫించనుదార్ల ఇంటి వద్దే నగదు పంపిణీ చేయాలని సూచించారు. ఇందుకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పాటు అవసరం మేరకు ఇతర శాఖ ఉద్యోగుల సేవలను వినియోగించుకోవాలని ఏపీ ప్రభుత్వం సూచించింది.
ఒక్కొక్క ఉద్యోగికి 50 ఇళ్లు..
ఒక్కొక్క ఉద్యోగికి 50 ఇళ్ల చొప్పున ఫించన్ల పంపిణీ కార్యక్రమాన్ని అప్పగించే విధంగా.. క్లస్టర్ల వారీగా మ్యాపింగ్ కార్యక్రమాన్ని శుక్రవారం కల్లా పూర్తి చేయాలని ప్రభుత్వ ఆదేశించింది. సాధ్యమైనంత మేర ఒకే రోజు ఈ ఫించన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని.. అనివార్య కారణాల వల్ల ఇంకా ఎవరన్నా మిగిలిపోయి ఉంటే.. రెండో రోజు కూడా ఈ పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.