Tirupati Stampede Incident : 'మీరంతా క్షమాపణ చెప్పి తీరాల్సిందే' - టీటీడీ పాలకమండలికి డిప్యూటీ సీఎం పవన్ అల్టిమేటం..!
10 January 2025, 17:04 IST
- Deputy CM Pawan Comments On TTD : తిరుపతి తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఘటనకు బాధ్యత తీసుకుని.. టీటీడీ ఛైర్మన్, ఈవో, జేఈవోతో పాటు పాలకమండలి క్షమాపణలు చెప్పాలని సూచించారు. తొక్కిసలాట సంఘటన తనకు ఎంతో బాధను కలిగించిందని వ్యాఖ్యానించారు.

డిప్యూటీ సీఎం పవన్ (ఫైల్ ఫొటో)
తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ పాలకమండలి మొత్తం క్షమాపణలు చెప్పాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. ఛైర్మన్, ఈవో, జేఈవో సహా సభ్యులందరూ కూడా బాధితులను కలిసి సంతాపం తెలియజేయాలన్నారు. చనిపోయిన ప్రతీ కుటుంబం దగ్గరికి టీటీడీ బోర్డు, పోలీస్ శాఖ నుంచి వెళ్లి క్షమాపణలు చెప్పాలని.. చెప్పి తీరాల్సిందేనంటూ స్పష్టం చేశారు. తప్పు ఎవరివల్ల జరిగినా… ప్రభుత్వంలో భాగస్వామిని కాబట్టి తన బాధ్యతగా క్షమాపణలు కూడా చెప్పానని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 12,500 గోకులాల ప్రారంభోత్సవ సభ పిఠాపురంలో నిర్వహించారు. ఇందులో మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్…. సంక్రాంతికి ఊరంత పందిరి వేసి చాలా అద్భుతంగా జరుపుకుందాం అనుకున్నామని.. కానీ తిరుమల ఘటనతో చాలా బాధగా ఉందన్నారు. కానీ వచ్చే సంవత్సరం సంక్రాంతి బాగా జరుపుకుందామని చెప్పారు.
క్షమాపణ చెప్పి తీరాల్సిందే - డిప్యూటీ సీఎం పవన్
"తిరుమల ఘటన ఎంతో కలిచివేసింది. జవాబుదారీతనంగా ఉంటానని ఎన్నికల సమయంలో చెప్పాను. అందులో భాగంగానే... తిరుమల ఘటనపై క్షమాపణలు చెప్పాను. వారిని పరామర్శించినప్పటికీ నాకు ఎంతో బాధ ఉంది. తప్పు ఎవరి వల్ల జరిగినా..బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. పరామర్శించే సమయంలో భక్తులు వారి బాధలను చెప్పుకున్నారు. సరిగా చూసుకోలేదన్నారు. వారు చెబుతుంటే కన్నీళ్లు వచ్చాయి. అలాంటి వారికి మనం క్షమాపణలు చెప్పాలి. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, జేఈవోవెంకయ్య చౌదరి,పాలకమండలి సభ్యులు వారి బాధ వింటే పరిస్థితి అర్థమవుతుంది. మీరంతా వెళ్లి క్షమాపణలు చెప్పండి. చెప్పి తీరాల్సిందే. వేరే దారి లేదు మీకు" అంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఓ రకంగా ఆయన టీటీడీ అధికారులకు అల్టిమేటం ఇచ్చారనే చెప్పొచ్చు. అయితే త్వరలోనే టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. ఇక డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యల నేపథ్యంలో… టీటీడీ పాలకమండలి నుంచి ఎలా స్పందన వస్తుందనేది చూడాలి…!