TDP Chandrababu : త్వరలో ‘జన్మభూమి -2’, నామినేటెడ్ పదవుల భర్తీ - టీడీపీ పొలిట్‌బ్యూరోలో కీలక నిర్ణయాలు
08 August 2024, 20:42 IST
- TDP Politburo Meeting : టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశమైంది. ఇందులో నామినేటెడ్ పదవుల భర్తీతో పాటు పలు కీలక అంశాలపై చర్చించారు.
చంద్రబాబు అధ్యక్షతన పొలిట్ బ్యూరో సమావేశం
TDP Politburo Meeting : తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఆ పార్టీ పొలిట్‌బ్యూరో భేటీ అయింది. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.
త్వరలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. త్వరలోనే మొదటి దశ నామినేటెడ్ పదవుల భర్తీకి నిర్ణయం తీసుకున్నారు . నామినేటెడ్ పోస్టులను దశలవారీగా ఇవ్వాలని నిర్ణయించారు.
‘జన్మభూమి-2’ను త్వరలోనే ప్రారంభించాలని పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయించారు. నైపుణ్య గణనపై చర్చించారు. దేశంలోనే తొలిసారిగా ఏపీలో చేపట్టాలని నేతలు అభిప్రాయపడ్డారు. జిల్లా యూనిట్‌గా ఎస్సీ వర్గీకరణ చేపట్టే అంశంపై చర్చించారు. సాధ్యమైనంత త్వరగా నామినేటెడ్ పదవుల భర్తీపై నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పొలిట్ బ్యూరో భేటీ కావటం ఇదే తొలిసారి.
మంత్రి నారా లోకేశ్ సమీక్ష :
యువతలో నైపుణ్యాలను గుర్తించి వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపర్చే లక్ష్యంతో దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో స్కిల్ సెన్సెస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న స్కిల్ సెన్సెస్ విధివిధానాల రూపకల్పనపై స్కిల్ డెవలప్ మెంట్ అధికారులతో మంత్రి సమీక్షించారు.
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... స్కిల్ సెన్సెస్ పూర్తిచేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నిర్దేశిత సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఆన్ లైన్ విధానంలో స్కిల్ సెన్సస్ వివరాలు సేకరిస్తారు. స్కిల్ సెన్సెస్ లో భాగంగా వివరాలను సేకరించి, వారిలో నైపుణ్యాభివృద్ధికి చర్యలు తీసుకోవడం, ఉపాధి అవకాశాలు కల్పించడం, తద్వారా వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చడడం ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశమని తెలిపారు.
తొలుత ఒక నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్ గా చేపట్టి, తర్వాత రాష్ట్రవ్యాప్తంగా దీనిని చేపట్టేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. మరింత మెరుగైన ఫలితాల కోసం అవసరాన్ని బట్టి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ను కూడా ఉపయోగించాలని అన్నారు.
స్కిల్ సెన్సెస్ లో భాగంగా ఆయారంగాల్లో ఆసక్తి ఉన్న యువతను గుర్తించి శిక్షణ ఇచ్చాక, వారికి ప్రఖ్యాత సంస్థలతో సర్టిఫికేట్ ను కూడా అందజేస్తారు. రాష్ట్రంలోని పరిశ్రమలతోపాటు నౌక్రీ డాట్.కామ్, లిన్క్ డిన్ వంటి పోర్టల్స్ ద్వారా మెరుగైన అవకాశాలను పొందడానికి ఈ సర్టిఫికేషన్ ఉపయోగపడుతుందని తెలిపారు.
స్థానికంగా అందుబాటులో లేకపోయినప్పటికీ ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో విద్యను అభ్యసిస్తున్న యువతీ యువకులు కూడా ఆన్ లైన్ ద్వారా స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. యువతలో నైపుణ్యాలను డిజిటలైజ్ చేసి అవకాశాలను మెరుగుపర్చడమే స్కిల్ సెన్సెస్ లక్ష్యమని చెప్పారు.
ఇందులో భాగంగా ఎన్యుమరేటర్లకు శిక్షణ ఇవ్వాలని, యువతను చైతన్యవంతం చేయాలని సూచించారు. సర్వే అంశాలు సాధ్యమైనంత సులభంగా ఉండేలా చూడాలని అన్నారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో జరిగే సమావేశంలో విధివిధానాలు ఖరారు చేయాలని సమావేశంలో నిర్ణయించారు.