తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Madanapalle Murder: ఏకకాలంలో ముగ్గురితో ప్రేమాయణం .. పెళ్లి చేసుకోమన్నందుకు తండ్రినే చంపేసింది..

Madanapalle Murder: ఏకకాలంలో ముగ్గురితో ప్రేమాయణం .. పెళ్లి చేసుకోమన్నందుకు తండ్రినే చంపేసింది..

Sarath chandra.B HT Telugu

18 June 2024, 6:54 IST

google News
    • Madanapalle Murder: తప్పుదారిలో పయనిస్తున్న కుమార్తెను మందలించి పెళ్లి చేసుకోమని చెప్పడమే ఆ ఉపాధ్యాయుడు చేసిన పాపమైంది. మదనపల్లెలో సంచలనం సృష్టించిన ఉపాధ్యాయుడి హత్య వ్యవహారంలో కుమార్తెను హంతకురాలిగా తేల్చారు. 
చెడు స్నేహాలు వద్దన్నందుకు తండ్రిని చంపేసిన తనయురాలు
చెడు స్నేహాలు వద్దన్నందుకు తండ్రిని చంపేసిన తనయురాలు

చెడు స్నేహాలు వద్దన్నందుకు తండ్రిని చంపేసిన తనయురాలు

Madanapalle Murder: మదనపల్లెలో గత వారం జరిగిన ఆదర్శ ఉపాధ్యాయుడి దారుణ హత్య మిస్టరీ వీడింది. కుమార్తె చేతిలో తండ్రి దొరస్వామి హత్యకు గురైనట్టు పోలీసులు నిర్ధారించారు. చెడు మార్గంలో పయనిస్తున్న కుమార్తెకు పెళ్లి చేసేందుకు ప్రయత్నించడమే ఆయన చేసిన పాపమైంది. కుప్పంకు చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయించడంతో రగిలిపోయిన కుమార్తె తండ్రిని దారుణంగా హత్య చేసింది.

ఇష్టం లేని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నారనే కోపంతో నిద్రిస్తున్న కన్నతండ్రిపై దాడి చేసి చంపేసింది. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జూన్‌ 13న జరిగిన హత్య కేసు వివరాలను మదనపల్లె డీఎస్పీ ప్రసాదరెడ్డి వివరించారు.

మదనపల్లె పీఅండ్‌టీ కాలనీలో నివాసం ఉంటున్న దొరస్వామి దిగువ కురవంకలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఆయన గతంలో ఆదర్శ ఉపాధ్యాయుడిగా ప్రభుత్వం నుంచి పురస్కారాలు కూా అందుకున్నారు. దొరస్వామి భార్య లత ఏడాదిన్నర కిందట అనారోగ్యంతో మృతి చెందడంతో కుమార్తె హరితతో కలిసి సొంతింట్లో నివాసం ఉంటున్నారు.

రాత్రి పూటకు ఇంటికి ప్రియులు..

బీఎస్సీ, బిఈడీ చదివిన హరితకు పెళ్లి చేసేందుకు కొంత కాలంగా ప్రయత్నిస్తున్నారు. కూతురు పెళ్లి కోసం దాచిన డబ్బును కూడా భార్య చనిపోయిన తర్వాత ఆమె ఖాతాకు బదిలీ చేశాడు. తల్లికి చెందిన బంగారు నగలను కూడా ఆమెకు ఇచ్చాడు. ఈ క్రమంలో హరిత మదనపల్లెకు చెందిన రమేశ్‌ అనే యువకుడితో సన్నిహితంగా ఉంటూ తన బంగారు నగలు ఇచ్చింది. అతను వాటిని తాకట్టు పెట్టుకుని జల్సా చేసేవాడు. దొరస్వామికి రెండంతస్తుల భవనం ఉండగా కుమార్తె పై అంతస్తులో ఉండేది.

రాత్రి సమయంలో వారి ఇంటికి ఎవరో వస్తున్నారని స్థానికులు చెప్పడంతో నిఘా పెట్టిన దొరస్వామి కొద్ది నెలల క్రితం రమేష్‌ను పట్టుకున్నారు. ఆ సమయంలో బంగారు ఆభరణాల వ్యవహారం తెలియడంతో అతడిని పోలీసుకుల అప్పగించారు. అప్పటికే రమేష్‌ ఆభరణాలు తాకట్టు పెట్టి రూ.11.40 లక్షలు అప్పుగా తీసుకున్నాడు.

దీంతో కుమార్తెకు పెళ్లి చేసి పంపేయాలని భావించి కుప్పంకు చెందిన ఓ యువకుడితో సంబంధాన్ని ఖరారు చేశారు. ఈ క్రమంలో పెళ్లి కోసం దాచిన డబ్బులో మరో రూ.8 లక్షల్ని సాయికృష్ణ అనే యువకుడికి ఇచ్చినట్టు దొరస్వామి గుర్తించాడు. వీరితో పాటు హరీశ్‌రెడ్డి అనే యువకుడితో కూడా ఆమె సన్నిహితంగా ఉంటోంది. అప్పటికే దొరస్వామి తన ఇంటిని కూడా కుమార్తె పేరిట గిఫ్ట్ డీడ్ చేశాడు. త్వరలో రిటైర్మెంట్ కానుండటంతో ఆ డబ్బులతో పెళ్లి చేస్తానని కుమార్తెతో ఘర్షణ పడుతున్నాడు. రమేష్‌తో పాటు మరో ఇద్దరు యువకులతో హరిత ఏకకాలంలో ప్రేమాయణం నడిపింది.

కుప్పంకు చెందిన యువకుడిని పెళ్లి చేసుకుని పాత స్నేహాలు విడిచిపెట్టాలని తరచూ కుమార్తెను మందలిస్తున్నాడు. దానికి హరిత నిరాకరించింది. దాదాపు నెల రోజులుగా తండ్రి, కుమార్తెల మధ్య ఈ విషయంలో గొడవలు జరుగుతున్నాయి.ఈ నెల 13న ఇంట్లో మద్యం సేవించి నిద్రించిన దొరస్వామిపై హరిత దాడి చేసింది. ఇంట్లో చపాతీ కర్ర, పరీక్షలు రాసే అట్ట, తాళంకప్ప, కర్రలతో విచక్షణా రహితంగా తలపై దాడి చేసింది. తీవ్రగాయాలతో స్పాట్‌లోనే ప్రాణాలు విడిచారు.

హత్య జరిగిన సమయంలో అరుపులు విని చుట్టుపక్కల వారు వెళ్లేసరికి దొరస్వామి రక్తపు మడుగులో పడి ఉన్నారు. తండ్రి కాలుజారి కింద పడ్డాడని వారితో చెప్పింది. అప్పటికే ఆమె వ్యవహారంపై ఇంట్లో గొడవలు జరుగుతున్న విషయం తెలిసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.

గాయాలయ్యాయని హరిత వారికి చెప్పడం గమనార్హం. తరువాత పోలీసులకూ అదే విషయాన్ని తెలిపింది. పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేసి హరితే హత్య చేసినట్లుగా నిర్ధారించారు. నిందితురాలిని సోమవారం అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. హత్య వ్యవహారంలో ఆమె ప్రియుల పాత్రపై విచారణ జరుపుతున్నట్టు పోలీసులు డిఎస్పీ తెలిపారు. తండ్రిని అడ్డు తొలగించుకోవాలని వారు సూచించినట్టు తేలితే వారిపై కూడా కేసు నమోదు చేస్తామన్నారు.

తదుపరి వ్యాసం