AP Rain ALERT : ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్ - ఏపీలో తేలికపాటి వర్షాలు...! తెలంగాణలో పూర్తిగా పొడి వాతావరణం
Published Jan 11, 2025 07:48 AM IST
- AP Telangana Weather Updates : నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. ఈ ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. అయితే ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది. తెలంగాణలో పూర్తిగా పొడి వాతావరణమే ఉండనుంది.
ఏపీకి వర్ష సూచన
నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. సగటు సముద్రమట్టానికి 3.1 కిమీ ఎత్తులో విస్తరించి ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ, రేపు, ఎల్లుండి పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉత్తర కోస్తాలో ఇవాళ, రేపు పూర్తిగా పొడి వాతావరణమే ఉంటుందని స్పష్టం చేసింది. కానీ దక్షిణ కోస్తాలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఇక రాయలసీమ జిల్లాలో చూస్తే.. ఇవాళ పొడి వాతావరణం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఒకటి రెండు చోట్ల పడొచ్చని వెల్లడించింది. ఏపీకి తేలికపాటి వర్ష సూచన ఉండగా.. ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది. ఉపరితల ఆవర్తన ప్రభావం ఏపీలో రెండు మూడు రోజులు కూడా పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో జల్లులు కురువొచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది.
తెలంగాణలో పొడి వాతావరణం:
ఇక తెలంగాణలో చూస్తే పూర్తిగా పొడి వాతావరణమే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరో నాలుగైదు రోజులు ఇలాగే ఉంటుందని తాజా బులెటిన్ లో పేర్కొంది. ఎలాంటి వర్ష సూచన లేదని స్పష్టం చేసింది. జనవరి 16వ తేదీ వరకు కూడా పొడి వాతావరణమే ఉంటుందని తెలిపింది.
ఇక రాబోయే 5 రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఉదయం సమయంలో పొగమంచు కురిసే అవకాశం ఉంది. ఈ 3 రోజుల్లో కనిష్ణ ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర వివరించింది.