తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Rain Alert : తీరం దాటిన 'ఫెంగల్' తుపాన్ - దక్షిణ కోస్తా, రాయలసీమకు భారీ వర్ష సూచన!

AP Rain ALERT : తీరం దాటిన 'ఫెంగల్' తుపాన్ - దక్షిణ కోస్తా, రాయలసీమకు భారీ వర్ష సూచన!

01 December 2024, 6:50 IST

google News
    • 'ఫెంగల్'తుపాన్ పూర్తిగా తీరం దాటింది. శనివారం రాత్రి పుదుచ్చేరి సమీపంలో తీరం దాటినట్లు ఐఎండీ తెలిపింది.  క్రమంగా బలహీన పడనుందని అంచనా వేసింది. ఈ ప్రభావంతో ఇవాళ దక్షిణ కోస్తా, సీమ జిల్లాల్లోని పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. 
తీరం దాటిన 'ఫెంగల్'తుపాన్
తీరం దాటిన 'ఫెంగల్'తుపాన్

తీరం దాటిన 'ఫెంగల్'తుపాన్

నైరుతి బంగాళాఖాతంలోని 'ఫెంగల్'తుపాన్ పూర్తిగా తీరం దాటింది. శనివారం రాత్రి 10:30 నుంచి 11:30 మధ్య పుదుచ్చేరి సమీపంలో తీరం దాటినట్లు వాతావరణశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఇది పశ్చిమ-నైరుతి దిశగా నెమ్మదిగా కదులుతూ క్రమంగా బలహీన పడనుందని పేర్కొంది.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఏపీకి భారీ వర్ష సూచన…

ఈ ప్రభావంతో నేడు దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

ఇవాళ, రేపు నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, శ్రీసత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.  ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్‌ జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదముందని హెచ్చరించింది. రేపటి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది.

తుపాన్ ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సీమ జిల్లాల్లో ఈ ప్రభావం మరి ఎక్కువగానూ ఉంది. వర్షం కారణంగా…. తిరుమల నుంచి శ్రీవారి పాదాలు, పాపవినాశనం వెళ్లే మార్గాలను మూసివేశారు. శనివారం తిరుపతి జిల్లాలోని కేఎం అగ్రహారంలో అత్యధికంగా 13.3 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఇక తీర ప్రాంతాల్లో అయితే ఈదురుగాలల ప్రభావం ఎక్కువగా ఉంది. కొన్నిచోట్ల పంట నష్టం వాటిల్లింది. 

మరోవైపు తుపాను ప్రభావంతో  చెన్నై వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెన్నై ఎయిర్ పోర్టును అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. చెన్నై నుంచి హైదరాబాద్‌ రావాల్సిన మూడు విమానాలను రద్దు చేశారు. హైదరాబాద్‌ నుంచి చెన్నై వెళ్లాల్సిన విమానాలు కూడా రద్దయ్యాయి. హైదరాబాద్‌ నుంచి తిరుపతికి వెళ్లాల్సిన ఏడు విమానాలతో పాటు తిరుపతి నుంచి హైదరాబాద్‌ విమానాలను రద్దు చేసినట్లు ఎయిర్ లైన్స్ ప్రకటించాయి. ప్రతికూల వాతావరణం వల్ల దాదాపు పది విమానాలు రద్దు చేసినట్లు ఎయిర్ పోర్ట్ అధికారులు వెల్లడించారు. ముంబై, త్రిపుర వెళ్లే పలు విమాన సర్వీసులు కూడా రద్దు చేశారు.

సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు…

ఫెంగల్ తుఫాన్ పై  ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. శనివారం నిర్వహించిన సమీక్షలో విపత్తు నిర్వహణ శాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, సీఎంఓ, రియల్ టైం గవర్నెన్స్ అధికారులు ఇందులో పాల్గొన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు రియల్ టైంలో అంచనా వేసి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ధాన్యం రైతులు ఆందోళనగా ఉన్నారని… నిర్ధిష్టమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అన్నదాతలకు చేరవేయాలని సూచించారు.  ఆస్తి, ప్రాణ నష్ట నివారణకు ముందునుంచే జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  సహాయక చర్యలు, పునరావాస కార్యక్రమాలకు సమాయాత్తం కావాలని జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.

తెలంగాణలోనూ వర్షాలు:

తెలంగాణలో ఇవాళ, రేపు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు చాలా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.

ఇవాళ తెలంగాణలోని (డిసెంబర్ 1) కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. రేపు కూడా చాలా జిల్లాల్లో వానలు పడనున్నాయి.

 

తదుపరి వ్యాసం