తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Roads : సంక్రాంతిలోపు రోడ్లపై ఒక్క గుంత ఉండొద్దు : చంద్రబాబు

AP Roads : సంక్రాంతిలోపు రోడ్లపై ఒక్క గుంత ఉండొద్దు : చంద్రబాబు

02 November 2024, 14:06 IST

google News
    • AP Roads : ఏపీ రోడ్ల మరమ్మత్తు పనులు ప్రారంభం అయ్యాయి. సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెంలో ప్రారంభించారు. గత ప్రభుత్వం రహదారులను నిర్లక్ష్యం చేసిందని చంద్రబాబు ఆరోపించారు. సంక్రాంతిలోపు రోడ్లపై ఒక్క గుంత ఉండొద్దని అధికారులను సీఎం ఆదేశించారు.
చంద్రబాబు
చంద్రబాబు

చంద్రబాబు

సంక్రాంతిలోపు రోడ్లపై ఒక్క గుంత ఉండొద్దని.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెంలో రహదారుల మరమ్మత్తు పనులను ప్రారంభించిన చంద్రబాబు.. అనంతరం జరిగిన బహిరంగసభలో మాట్లాడారు. గుంతలు లేని రోడ్లే తమ ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా వైసీపీపై విమర్శలు గుప్పించారు.

'ఐదేళ్లు గుంతలు తవ్వారు, గోతులు పెట్టారు. రోడ్లను ప్రమాదకరంగా మార్చారు. రోడ్లు అనేది నాగరికతకు చిహ్నం. రోడ్లు బాగుంటేనే పరిశ్రమలు వస్తాయి. సరైన సమయానికి గమ్యం చేరుకోవచ్చు. గత ఐదేళ్లలో రోడ్ల మరమ్మతుల కోసం.. రూ.వెయ్యి కోట్లు కాజేశారు. రోడ్లపై గర్భిణిలు డెలివరీ అయ్యే పరిస్థితి తెచ్చారు. నరకానికి మార్గాలుగా రహదారులను మార్చారు' అని సీఎం చంద్రబాబు విమర్శించారు.

'సంక్రాంతిలోపు రోడ్లపై ఒక్క గుంత ఉండొద్దు. రౌడీ రాజకీయాలు మనకు వద్దు. అభివృద్ధి రాజకీయాలు కావాలి. గుంతలు లేని రోడ్లకి కూడా పని చేయాల్సిన వస్తుంది అంటే, ఎందుకీ పరిస్థితి వచ్చిందో ఆలోచించుకోవాలి. రాష్ట్రానికే గోతులు తవ్వి వెళ్ళాడు. ఇలాంటి రోడ్లని ఇప్పుడు మేము బాగు చేస్తున్నాం. మంచి రోడ్లు ఉంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది. రవాణా ఖర్చులు తగ్గుతాయి.' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రారంభం అయ్యింది. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. సంక్రాంతి లోపు రోడ్ల మరమ్మత్తులు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు తగ్గట్టు పనులు చేస్తున్నారు.

గత ప్రభుత్వం రహదారులను అభివృద్ధి చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. కనీసం మరమ్మత్తులు కూడా చేయలేదనే విమర్శలు ఉన్నాయి. ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ఇది కూడా ఓ కారణమనే అభిప్రాయం ఉంది. ప్రచార సభల్లో కూడా చంద్రబాబు ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావించారు. ఎన్నికల ముందు రోడ్ల గురించి హామీ ఇచ్చారు. ఇప్పుడు రహదారుల మరమ్మత్తు పనులను ప్రారంభించారు.

తదుపరి వ్యాసం