Visakhapatnam Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ.11,440 కోట్ల ప్యాకేజీ - కేంద్రం అధికారిక ప్రకటన
17 January 2025, 16:29 IST
- Package For Visakhapatnam Steel Plant : విశాఖ ఉక్కుకు కేంద్ర ప్రభుత్వం భారీ ప్యాకేజీని ప్రకటించింది. రూ.11,440 కోట్ల ప్యాకేజీని ప్రకటించినట్లు అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటన విడుదల చేశారు. తాజా నిర్ణయంతో స్టీల్ ప్లాంట్ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
విశాఖ ఉక్కుకు రూ.11,440 కోట్ల ప్యాకేజీ - కేంద్రం అధికారిక ప్రకటన
విశాఖ ఉక్కు కేంద్రానికి కేంద్ర ప్రభుత్వం భారీ ఊతం ఇచ్చింది. తీవ్ర ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేసేందుకు రూ.11,440 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ కార్యాలయం శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.
కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ సమావేశంలో.. ప్యాకేజీ ఇచ్చే నిర్ణయానికి కూడా ఆమోదం తెలిపింది. కేంద్రం నిర్ణయం పట్ల విశాఖ ఉక్కు కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ప్లాంట్ పరిసరాల్లో టపాసులు పేల్చుతూ కార్మికులు సంబరాలు చేసుకున్నారు.
కేంద్రమంత్రి ప్రకటన…
దేశానికి విశాఖ స్టీల్ ఎంతో ముఖ్యం అని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఊతం ఇచ్చేలా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని చెప్పారు. రివైవల్ ప్యాకేకేజీ కింద రూ.11,440 కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు.
విశాఖ ఉక్కుకు ప్రకటించిన ఈ ప్యాకేజీ తక్షణం అమల్లోకి వస్తుందని అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. త్వరలో రెండు బ్లాస్ట్ ఫర్నేస్‌లు ప్రారంభమవుతాయని తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్‌లో విశాఖ ఉక్కు కీలక పాత్ర పోషిస్తుందని వ్యాఖ్యానించారు. దేశ ఉక్కు అవసరాలు తీర్చడంలో విశాఖ స్టీల్ ప్లాంట్‌ది కీలక పాత్ర ఉంటుందన్నారు.
"ఈ పునరుద్ధరణ ప్యాకేజీతో RINL ఎదుర్కొంటున్న అనేక సమస్యలు పరిష్కరించబడతాయి. ఇదే సమయంలో ఆర్‌ఐఎన్‌ఎల్‌కు ముడిసరుకును పొందేందుకు, ప్లాంట్‌ను ఆధునీకరించేందుకు ప్రయత్నాలు జరుగుతాయి. ఈ మొత్తం రూ.11440 ప్యాకేజీలో… రూ.10,300 కోట్లు ఈక్విటీ ఇన్‌ఫ్యూషన్ గా ఉంది. తాజా నిర్ణయంతో RINL ఉద్యోగులందరికీ ఎంతో ప్రయోజనం చేకూరుతుంది" అని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.
కేంద్రానికి ధన్యవాదాలు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్యాకేజీని ప్రకటించటంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. “ విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఊపిరి పోసేలా రివైవల్ ప్యాకేజీ కింద రూ.10,300 కోట్లు కేటాయించిన ప్రధాని నరేంద్ర మోదీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. నష్టాలను అధిగమించి, ప్లాంట్ పూర్తి స్థాయి ఉత్పాదనతో లాభాల బాట పెట్టేందుకు ఈసాయం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి, ప్రజల ఆకాంక్షల పట్ల ఎన్డీయే ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం” అంటూ రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేశారు.
“రూ.11,500 కోట్ల ప్యాకేజీతో విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ వేడుకలను జరుపుకొంటున్న ఈరోజు ఒక ముఖ్యమైన సందర్భం. ఇది కేవలం ఆర్థిక నిర్ణయం మాత్రమే కాదు. ఇది మన కార్మికుల విజయం. మన గర్వానికి చిహ్నం. పట్టుదల మరియు నిబద్ధత యొక్క శక్తికి నిదర్శనం. ఏపీ ప్రగతికి అహర్నిశలు పాటుపడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఈ పునరుద్ధరణ ప్యాకేజీని సాధించడంలో నిర్ణయాత్మక పాత్ర పోషించిన కేంద్ర ఉక్కుశాఖ మంత్రి శ్రీ కుమారస్వామి గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్‌కే గర్వకారణంగా నిలిచిన ఈ చారిత్రాత్మక నిర్ణయం.. అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కేలా వారి కృషి ఉంది” అని రామ్మోహన్ నాయుడు తన పోస్టులో రాసుకొచ్చారు.
చారిత్రాత్మక ఘట్టం - సీఎం చంద్రబాబు ట్వీట్
కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. “ఈ రోజు ఉక్కుతో చెక్కబడిన ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని సూచిస్తుంది. ఎన్‌డిఎ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి గోఏపీ(GoAP) కోసం చేస్తున్న స్థిరమైన ప్రయత్నాలకు ప్రతిస్పందన వస్తూనే ఉంది. కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు 11,440 కోట్లు ఇవ్వటమే ఇందుకు నిదర్శనం” అని పోస్టులో రాసుకొచ్చారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీతో పాటు, ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామికి ప్రత్యేక ధన్యావాదాలు తెలిపారు.
తాజాగా స్టీల్ ప్లాంట్ కు కేంద్రం భారీగా ఆర్థిక ప్యాకేజీ ప్రకటించటంతో ప్రైవేటీకరణపై పూర్తి స్థాయిలో వెనుకడుగు వేసినట్లే అని విశ్లేషకులు భావిస్తున్నారు. స్టీల్ ఉత్పత్తిని పెంచి సెయిల్ లో విలీనం చేసే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కూడా అభిప్రాయపడుతున్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వంలోని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు స్వాగతిస్తున్నాయి.