వైసీపీ నుంచి రాజ్యసభకు ఆర్.కృష్ణయ్య..?
17 May 2022, 11:14 IST
- వైసీపీలో రాజ్యసభ స్థానాల భర్తీ హడావుడి మొదలైంది. వైసీపీ నుంచి రాజ్యసభకు వెళ్లే వారిలో ఇప్పటికే రకరకాల పేర్లు తెరపైకి వస్తున్న నేపథ్యంలో బీసీ సంఘాల జాతీయ నాయకుడు ఆర్.కృష్ణయ్య పేరు తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఒకటి రెండు రోజుల్లో వైసీపీ అభ్యర్ధుల పేర్లను ఖరారు చేసే అవకాశం ఉంది.
వైసీపీ నుంచి రాజ్యసభకు బీసీసంఘాల జాతీయ నాయకుడు ఆర్.కృష్ణయ్య
ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ స్థానాల భర్తీ కసరత్తు మొదలైంది. త్వరలో ఖాళీ అవుతున్న నాలుగు స్థానాలను వైసీపీ అభ్యర్ధులతో భర్తీ చేయాల్సి ఉండటంతో ఎవరెవరికి స్థానం దక్కుతుందోనన్న ఉత్కంఠ అందరిలోను నెలకొంది. పదవీ విరమణ చేయనున్న ఎంపీ విజయసాయిరెడ్డికి మరోమారు రాజ్యసభ అవకాశం కల్పిస్తారని చెబుతున్నారు. ఆయనతో పాటు రకరకాల పేర్లు తెరపైకి వచ్చినా ప్రధానంగా బీదమస్తాన్‌రావు, బీసీ సంఘాల నాయకుడు ఆర్.కృష్ణయ్య, నిర్మాత నిరంజన్ రెడ్డిల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మొదట అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన భార్య ప్రీతి అదానీ పేర్లు వినిపించినా రాజకీయాల్లోకి రావట్లేదని వారు తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నుంచి భర్తీ చేసే నాలుగు స్థానాల్లో రెండింటికి పేర్లు ఖరారు కాగా మరో రెండింటిపై రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. 2024 ఎన్నికలు లక్ష్యంగా రాజ్యసభ అభ్యర్ధుల ఎంపిక ఉంటుందని వైసీపీ నేతలు చెబుతున్నారు.
మరోవైపు రాజ్యసభ అభ్యర్ధుల ఎంపిక నేపథ్యంలో బీసీ సంఘాల నాయకుడు ఆర్.కృష్ణయ్య సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి కర్నూలు పర్యటనలో ఉండటంతో ఆయన తిరిగి వచ్చిన తర్వాత సీఎంతో భేటీ అయ్యే అవకాశాలున్నాయి. బీదమస్తాన్‌రావు సైతం తాడేపల్లి కార్యాలయానికి వచ్చారు. బీసీ సంఘాల నాయకుడు ఆర్.కృష్ణయ్య గతంలో ఎల్‌బీ నగర్ నియోజక వర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. రాజ్యసభ స్థానాల భర్తీ నేపథ్యంలో ఆర్.కృష్ణయ్యకు వైసీపీ నుంచి రాజ్యసభకు పంపడం ద్వారా బీసీలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ స్థానం ఆశిస్తున్న వారిలో గత ఏడాది వైసీపీలో చేరిన పారిశ్రామికవేత్త చలమలశెట్టి సునీల్ పేరు కూడా వినిపిస్తోంది.
టాపిక్