తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vallabhaneni Vamsi : హైదరాబాద్ లోని వల్లభనేని వంశీ ఇంట్లో సోదాలు, సెల్ ఫోన్ కోసం ఆరా

Vallabhaneni Vamsi : హైదరాబాద్ లోని వల్లభనేని వంశీ ఇంట్లో సోదాలు, సెల్ ఫోన్ కోసం ఆరా

Updated Feb 15, 2025 02:51 PM IST

google News
  • Vallabhaneni Vamsi : టీడీపీ ఆఫీసులో పనిచేసిన సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి, దాడి చేసిన కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే వైసీపీ నేత వల్లభనేని వంశీని అరెస్టు చేసిన పోలీసులు...తాజాగా ఆయన నివాసంలో సోదాలు చేపట్టారు.

హైదరాబాద్ లోని వల్లభనేని వంశీ ఇంట్లో సోదాలు, సెల్ ఫోన్ కోసం ఆరా

హైదరాబాద్ లోని వల్లభనేని వంశీ ఇంట్లో సోదాలు, సెల్ ఫోన్ కోసం ఆరా

Vallabhaneni Vamsi : టీడీపీ కార్యాలయంలో పనిచేసిన సత్యవర్ధన్‌ను కిడ్నాప్, దాడి చేసిన కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనకు కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని వల్లభనేని వంశీ ఇంట్లో ఏపీ పోలీసులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్‌ రాయదుర్గంలోని వంశీ ఇంట్లో ఏపీ పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

వ్యక్తిగత సహాయకుడి సెల్ ఫోన్ సీజ్

వల్లభనేని వంశీ వినియోగించిన ఫోన్‌పై పోలీసులు దృష్టి సారించారు. ఫోన్ స్వాధీనం చేసుకుంటే కేసుకు సంబంధించిన ముఖ్యమైన ఆధారాలు లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. హైదరాబాద్‌లో వంశీని అరెస్టు చేసే సమయంలో ఆయన వద్ద మొబైల్ దొరకలేదు. దీంతో ఆ వ్యక్తిగత సహాయకుడి ఫోన్‌ను గురువారం స్వాధీనం చేసుకుని, సీజ్‌ చేశారు. ఈ ఫోన్ ను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు.

సెల్ ఫోన్ చిక్కితే

వైసీపీ నేత వంశీ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకునేందుకు కోర్టు అనుమతి కోరుతూ... విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. వంశీ ఫోన్‌ తమ చేతికి వస్తే గుట్టు వీడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. అయితే వంశీ రెగ్యులర్‌ కాల్స్‌ కాకుండా వాట్సాప్‌ కాల్స్ ఎక్కువగా మాట్లాడుతుంటారని పోలీసులు గుర్తించారు.

ఈ నేపథ్యంలో ఫోన్‌కు సంబంధించి ఐపీడీఆర్‌ వివరాలను రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తు్న్నారు. వంశీ ఎవరెవరితో టచ్‌లో ఉన్నారనేది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో ఇతర నిందితుల అరెస్టుకు వంశీ సెల్‌ఫోన్‌ కీలకం కానుందని పోలీసులు అంటున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ఓ బృందం రంగంలోకి దిగినట్లు చెప్పారు.

2023 దాడి కేసు

2023, ఫిబ్రవరి 20న గన్నవరం టీడీపీ కార్యాలయంపై వల్లభనేని వంశీ అనుచరులు దాడికి పాల్పడి విధ్వంసం సృష్టించారు. అప్పట్లో టీడీపీ ఆఫీసులో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న సత్యవర్ధన్‌ దాడిపై ఫిర్యాదు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో సమయంలో ఆ కేసు ముందుకు సాగలేదు. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం రాగానే ఈ కేసును సీఐడీకి అప్పగించింది. దాడికి సంబంధించి 94మందిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఆ కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీను ఏ71గా చేర్చింది. ఇప్పటికే సీఐడీ 40 మందిని అరెస్టు చేసింది.

వంశీ అరెస్ట్

అనూహ్యంగా ఫిర్యాదుదారు సత్యవర్ధన్‌ను కేసు వెనక్కి తీసుకుంటున్నట్టు కోర్టులో అఫిడవిట్‌ దాఖలు వేశారు. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ మోహన్ తో పాటు ఆయన అనుచరులపై విజయవాడ పటమట పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

దీంతో గురువారం ఉదయం హైదరాబాద్ రాయదుర్గంలోని మైహోం భుజా అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న వంశీని పోలీసులు అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. వంశీపై కిడ్నాప్, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లతో పాటు బీఎన్ఎస్ సెక్షన్లు 140(1), 308, 351(3), రెడ్ విత్ 3(5) కింద కేసు పెట్టారు. వంశీని అరెస్ట్‌ చేస్తున్నట్లు ఆయన సతీమణికి పోలీసులు నోటీసులు ఇచ్చారు.

తదుపరి వ్యాసం