తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Liquor Shops Lottery : ఏపీలో లిక్కర్ క్వీన్స్- 345 వైన్ షాపులు దక్కించుకున్న మహిళలు

AP Liquor Shops Lottery : ఏపీలో లిక్కర్ క్వీన్స్- 345 వైన్ షాపులు దక్కించుకున్న మహిళలు

14 October 2024, 22:58 IST

google News
  • AP Liquor Shops Lottery : ఏపీలో మద్యం షాపుల లాటరీలో మహిళలు పోటీ పడ్డారు. రాష్ట్రంలోని 3396 మద్యం షాపుల్లో 345 దుకాణాలను మహిళలు దగ్గించుకున్నారు. అత్యధికంగా విశాఖలో 31 షాపులు మహిళలకు దక్కాయి. శ్రీసత్యసాయి జిల్లాలో మద్యం షాపు దక్కించున్న వ్యాపారిని దుండగులు కిడ్నాప్ చేశారు.

ఏపీలో లిక్కర్ క్వీన్స్- 345 షాపులు దక్కించుకున్న మహిళలు
ఏపీలో లిక్కర్ క్వీన్స్- 345 షాపులు దక్కించుకున్న మహిళలు

ఏపీలో లిక్కర్ క్వీన్స్- 345 షాపులు దక్కించుకున్న మహిళలు

ఏపీలో మద్యం షాపుల లాటరీలు కోలాహలంగా జరిగాయి. లిక్కర్ షాపులను దక్కించుకునేందుకు మహిళలు సైతం పోటీ పడ్డారు. రాష్ట్రంలోని 3396 మద్యం షాపుల్లో 345 దుకాణాలను మహిళలు దక్కించుకున్నారు. విశాఖలో అత్యధికంగా 155 షాపుల్లో 31 మహిళలకు లక్కీ డ్రా రాగా, అనకాపల్లిలో 25 షాపులు, శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో 24 చొప్పున షాపులు మహిళలకు దక్కాయి. అత్యల్పంగా బాపట్ల జిల్లాలో ఒక షాపు మహిళకు దక్కింది.

శ్రీసత్యసాయి జిల్లాలో లాటరీలో మద్యం షాపు దక్కించుకున్న వ్యాపారిని కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. ఈ ఘటన జిల్లాలోని చిలమత్తూరు మండలంలో చోటుచేసుకుంది. పుట్టపర్తిలో జరిగిన లక్కీ డ్రాలో మద్యం దుకాణాన్ని దక్కించుకొని రంగనాథ్‌ అనే వ్యాపారి బయటకు రాగానే గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. ఈ విషయం తెలుసుకున్న అతడి భార్య పుట్టపర్తి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈ నెల 16 నుంచి విక్రయాలు

ఏపీ నూతన మద్యం పాలసీ పారదర్శకంగా అమలు చేస్తున్నామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,396 మద్యం షాపులకు దరఖాస్తులు ఆహ్వానించగా... 89,882 అప్లికేషన్లు వచ్చినట్లు ప్రకటించారు. ఒక్కో మద్యం షాపునకు సగటున 25 మంది అప్లై చేశారన్నారు. దరఖాస్తుల ద్వారా ఏపీ ప్రభుత్వానికి రూ.1,798 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ఇవాళ లాటరీ ప్రక్రియ నిర్వహించి మద్యం షాపులు కేటాయింటినట్లు వెల్లడించారు. ఈ నెల 16 నుంచి నూతన మద్యం విధానంలో విక్రయాలు జరుగనున్నట్లు పేర్కొన్నారు.

ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 వరకు

మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణ, షాపుల కేటాయింపు అంతా సజావుగా జరిగిందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. 16వ తేదీ నుంచి అమలయ్యే నూతన మద్యం పాలసీలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు మాత్రమే మద్యం విక్రయాలు జరుగుతాయన్నారు. కొత్త బ్రాండ్ల టెండర్ కమిటీ ద్వారా ఫైనల్ చేసి తీసుకుంటామన్నారు. మద్యం షాపుల విషయంలో ఎవరు తప్పు చేసినా ఎవరినీ వదిలేది లేదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా షాపులు నిర్వహించినా, మద్యం విక్రయించినా కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఆలయాలు, పాఠశాలలకు 100 మీటర్లలోపు మద్యం షాపులు ఉండకూడదన్నారు. ఎంఆర్‌పీ ధరల కంటే ఎక్కువకు అమ్మకాలు, బెల్టు, కల్తీ మద్యం అమ్మకాలపై కఠిన చర్యలుంటాయన్నారు. వైన్ షాపుల్లో సిండికేట్ జరిగినట్లు ఎలాంటి ఎవరూ ఫిర్యాదు అందలేదన్నారు. ఎక్కడైనా అలాంటి ఘటనలు జరిగినట్లు తెలిస్తే చర్యలుంటాయన్నారు. కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో మహిళలు, ఉద్యోగులు, యువత దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు.

వైఎస్ జగన్ విమర్శలు

లిక్కర్‌ మాఫియాకు, సిండికేట్లకు ఏపీ అడ్డాగా మారిపోయిందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. ఈ మాఫియాకు సూత్రధారి, పాత్రధారి చంద్రబాబే అని ఆరోపించారు. అత్యంత పారదర్శకంగా నడుస్తున్న ప్రభుత్వ మద్యం దుకాణాలను మూసివేసి, వాటిని ప్రైవేటుకు అప్పగించాలన్న నిర్ణయం అవినీతికోసం వేసిన స్కెచ్‌ అన్నారు. మీ మనుషులతో సిండికేట్‌ ఏర్పాటుచేసి షాపులను కొట్టేశారన్నారు. రానున్న ఐదేళ్లలో పెద్దమొత్తంలో ఎమ్మార్పీ కంటే అధిక రేట్లతో మద్యం అమ్మి, టీడీపీ అనుకూల డిస్టలరీల ద్వారా అమ్మకాలు భారీ స్థాయిలో పెంచేసి వేలకోట్ల రూపాయల అక్రమ రాబడికి ద్వారాలు తెరిచారన్నారు.

తదుపరి వ్యాసం