AP Inter Hall Tickets: వాట్సాప్ మనమిత్రలో ఏపీ ఇంటర్మీడియట్ హాల్ టిక్కెట్లు లభ్యం…
Published Feb 07, 2025 05:43 AM IST
- AP Inter Hall Tickets: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ హాల్ టిక్కెట్లు విడుదలయ్యాయి. ప్రాక్టికల్ పరీక్షలు మొదలు కానుండటంతో ఇంటర్ విద్యార్థులకు హాల్ టిక్కెట్లను జారీ చేస్తున్నారు. ఈ ఏడాది కాలేజీలతో సంబంధం లేకుండా నేరు వాట్సప్ మనమిత్రలోనే హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం కల్పించారు.
వాట్సాప్ మనమిత్రలో అందుబాటులోకి వచ్చిన ఏపీ ఇంటర్ హాల్ టిక్కెట్లు
AP Inter Hall Tickets: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షల హాల్ టిక్కెట్లను వాట్సాప్ మనమిత్రలో అందుబాటులోకి తీసుకువచ్చారు. మార్చి 1 నుంచి ఏపీలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇంటర్మీడియట్ పరీక్షల హాల్ టికెట్లను వాట్సప్ గవర్నెన్స్‌లో భాగంగా మనమిత్ర పేజీ ద్వారా అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
ఇంటర్ విద్యార్థులు వాట్సప్ ద్వారా శుక్రవారం నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి వస్తుంది. ఇంటర్ విద్యార్థులకు కాలేజీ ఫీజులు బకాయిలు ఉన్నారంటే ప్రైవేటు కళాశాలలు పరీక్షల సమయంలో హాల్ టిక్కెట్లను నిలిపి వేయడం వంటి ఘట నలు లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో మెగా భాగస్వామ్యంలో వాట్సప్ గవర్నెన్స్ ద్వారా పలు రకాల ప్రభుత్వ సేవల్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన 161 సేవలను వాట్సాప్ భాగస్వామ్యంలో అందిస్తున్నారు.
ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌లలో దాదాపు 10 లక్షల మంది విద్యార్దులు పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్షలకు సన్నద్దమవుతున్న నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో ప్రిపరేషన్ హాలీడేస్ ఇస్తారు. ఈ క్రమంలో ప్రభుత్వ వాట్సప్ నంబరు 95523 00009 ద్వారా ఇంటర్ విద్యార్థులు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈ ఏడాది పదో తరగతి విద్యార్థులకు కూడా హాల్ టిక్కెట్లను వాట్సాప్‌లో అందించాలని విద్యాశాఖ భావిస్తోంది. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి, వాటిని ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యాలయానికి అనుసం ధానం చేయనున్నారు. ఫిబ్రవరి 10 నుంచి 20 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ 2025 పబ్లిక్ పరీక్షలు మార్చి 1నుంచి జరుగుతాయి. 2025 మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఎన్విరాన్‌మెంట్ సైన్స్, మోరల్ వాల్యూస్ పరీక్షల్ని ఫిబ్రవరి 1, 3వ తేదీల్లో నిర్వహిస్తారు. ఫిబ్రవరి 10 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు.