AP Cabinet Decisions : ఫీజు రీయంబర్స్మెంట్ పై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, నేరుగా కాలేజీల ఖాతాల్లోనే- కేబినెట్ నిర్ణయాలివే
06 November 2024, 16:15 IST
AP Cabinet Key Decisions : ఏపీని ప్రపంచ డ్రోన్ డెస్టినేషన్ గా మార్చేందుకు డ్రోన్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. డ్రోన్ లపై పరిశోధనలు చేసే విద్యాసంస్థలకు రూ.20 లక్షల ప్రోత్సహకాలు అందించనున్నారు. విద్యార్థుల ఫీజు రీయంబర్స్మెంట్ ఇకపై నేరుగా కాలేజీల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఫీజు రీయంబర్స్మెంట్ పై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, నేరుగా కాలేజీల ఖాతాల్లోనే- కేబినెట్ నిర్ణయాలివే
ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. వెలగపూడి సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ తీర్మానాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరించారు. రూ.1000 కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా ఏపీ డ్రోన్ పాలసీ 2024-29ను ఏపీ డ్రోన్ కార్పొరేషన్ రూపొందించినట్లు మంత్రి తెలిపారు. ప్రపంచ డ్రోన్ డెస్టినేషన్ గా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దనున్నట్లు తెలపారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లును డ్రోన్ హబ్ మారుస్తామన్నారు. డ్రోన్స్ రంగంలో 40 వేల ఉద్యోగాల కల్పన, రూ.3 వేల కోట్ల రాబడి లక్ష్యంగా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుందన్నారు.
డ్రోన్ లపై పరిశోధనలు చేసే విద్యాసంస్థలకు రూ.20 లక్షలు
ఓర్వకల్లులోని 300 ఎకరాల్లో డ్రోన్స్ తయారీ, టెస్టింగ్, ఆర్ అండ్ డీ ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పార్థసారథి తెలిపారు. 25 వేల మందికి డ్రోన్ పైలెట్లుగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే రాష్ట్రంలోని 20 రిమోట్ పైలెట్ ట్రైనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. దీంతో పాటు 50 డ్రోన్ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. డ్రోన్స్ రంగంలో పరిశోధనలు చేపట్టే విద్యాసంస్థలకు రూ.20 లక్షల వరకు ప్రోత్సాహం అందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.
సెమీ కండక్టర్ పరిశ్రమలకు 50 శాతం సబ్సిడీ
ఏపీ డేటా సెంటర్ పాలసీ 4.O కి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మంత్రి తెలిపారు. ఈ పాలసీ ద్వారా డేటా సెంటర్ల ఏర్పాట్లను ప్రోత్సహిస్తామన్నారు. దీంతో పాటు సెమీ కండక్టర్ పాలసీకి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి వెల్లడించారు. సెమీ కండక్టర్ పరిశ్రమలు ప్రారంభించే వారికి 50 శాతం సబ్సిడీ లేదా ఇన్సెంటివ్ అందిస్తామన్నారు. చిప్, సెమీ కండక్టర్ పరిశ్రమలకు విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా ప్రోత్సహిస్తామన్నారు. కుప్పం, పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. అలాగే సీఆర్డీఏ పరిధిని 8352 చ.కి.మీ.కు పెంచుతూ కేబినెట్ ఆమోదం తెలిపిందని స్పష్టం చేశారు. సీఆర్డీఏలోకి పల్నాడు, బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల నుంచి 154 గ్రామాలను చేర్చనున్నట్లు తెలిపారు.
ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్(ప్రొషిబిషన్)కు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పార్థసారథి అన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో భూఆక్రమణలు ఎక్కువగా జరిగాయన్నారు. ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 1982 ను రిపీల్ చేసి దాని స్థానంలో కొత్త చట్టం తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. రాష్ట్రంలోని ఎలాంటి భూములైనా కొత్త చట్టం కిందకు వస్తాయన్నారు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అమలు కోసం ప్రత్యేక కోర్టులు తెస్తామన్నారు.
జ్యూడీషియల్ అధికారులకు గుడ్ న్యూస్
నవంబర్ 1,2024 నుంచి జ్యూడీషియల్ అధికారుల పదవీ విరమణ వయసు 61కి పెంచుతూ కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఎక్సైజ్ పాలసీ ప్రకారం 3 ఆర్డినెన్స్‌లను అసెంబ్లీలో పెట్టి చట్ట సవరణ చేస్తామన్నారు. క్వాలిటీ లిక్కర్ తెచ్చేందుకు ఈ చట్టం ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థుల ఫీజు రీయంబర్స్మెంట్ పై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం బకాయిల నేపథ్యంలో విద్యార్థుల ఫీజు నేరుగా కాలేజీ ఖాతాలకు జమ చేయాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని పునరుద్ధరించడానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి వెల్లడించారు. పిఠాపురంలో 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.
ఏపీఐఐసీపై కేబినెట్ కీలక తీర్మానం చేసింది. 311 మంది పారిశ్రామికవేత్తలకు ఏపీఐఐసీ కేటాయించిన భూములను కేబినెట్ ఆమోదించిందన్నారు. ఇకపై ఏపీఐఐసీ నుంచి భూముల కేటాయింపు పరిధి 50 ఎకరాల వరకు పెంచుతున్నట్లు మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు.