తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Super Six Allocations: ఏపీ బడ్జెట్‌.. సూపర్‌ సిక్స్‌ పథకాలకు కేటాయింపులు ఉన్నట్టా లేనట్టా…ఈ ఏడాదికింతేనా?

Super Six Allocations: ఏపీ బడ్జెట్‌.. సూపర్‌ సిక్స్‌ పథకాలకు కేటాయింపులు ఉన్నట్టా లేనట్టా…ఈ ఏడాదికింతేనా?

11 November 2024, 12:31 IST

google News
    • Super Six Allocations: ఆంధ్రప్రదేశ్‌ వార్షిక బడ్జెట్‌ రూ.2.94లక్షల కోట్లతో  శాసనసభలో ప్రవేశపెట్టారు. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా శాఖలవారీ కేటాయింపులు చేశారు. టీడీపీ సూపర్‌ సిక్స్‌  ఎన్నికల హామీలకు అనుగుణంగా ముందుకు వెళుతున్నట్టు బడ్జెట్‌ ప్రసంగంలో పయ్యావుల పేర్కొన్నారు.
టీడీపీ గెలుపులో కీలక పాత్ర పోషించిన సూపర్‌ సిక్స్‌ హామీలపై బడ్జెట్‌లో కొరవడిన స్పష్టత
టీడీపీ గెలుపులో కీలక పాత్ర పోషించిన సూపర్‌ సిక్స్‌ హామీలపై బడ్జెట్‌లో కొరవడిన స్పష్టత

టీడీపీ గెలుపులో కీలక పాత్ర పోషించిన సూపర్‌ సిక్స్‌ హామీలపై బడ్జెట్‌లో కొరవడిన స్పష్టత

AP Budget 2024-25: ఆంధ్రప్రదేశ్‌ వార్షిక బడ్జెట్‌ను రూ. 2.94లక్షల కోట్లతో అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఏపీ వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ సభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో రెవిన్యూ వ్యవయయం రూ.2,35, 916.99కోట్లుగా ఉంది.బడ్జెట్‌లో మూల ధన వ్యయం రూ.32,712.84 కోట్లు కాగా రెవిన్యూ లోటును రూ.34,743.38కోట్లుగా ఉంది. ద్రవ్య లోటు రూ.68,742.65కోట్లుగా ఉంది. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో రెవిన్యూ లోటు 4.19శాతం, ద్రవ్యలోటు 2.12శాతం ఉంది.2023-24 ఆర్థిక సంవత్సరంలో రెవిన్యూ వ్యయం రూ.2,12,450కోట్లు కాగా మూలధన వ్యయం రూ23,330కోట్లుగాఉంది. 2023 - 24లో రెవిన్యూ లోటు రూ.38,682కోట్లుగా ఉంది.

సూపర్‌ సిక్స్‌ హామీలపై కొరవడిన స్పష్టత…

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పార్టీల తరపున ఇచ్చిన ఎన్నికల్లో హామీల్లో ప్రధానంగా సూపర్ సిక్స్‌ హామీలు ఉన్నాయి. వీటిలో బడికి వెళ్లే విద్యార్థులకు తల్లికి వందనం పేరుతో ఒకటి నుంచి ఇంటర్‌ చదివే ప్రతి ఒక్కరికి రూ.15వేల రుపాయలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. బడ్జెట్‌ ప్రసంగంలో ఇదే అంశాన్ని ప్రస్తావించారు. పేదరికం కారణంగా ఏ ఒక్కరూ చదువులకు దూరం కాకూడదనే ఉద్దేశంతో పథకాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు.

2024-25విద్యా సంవత్సరంలో పాఠశాల విద్యాశాఖకు రూ.29,909కోట్లను కేటాయించారు. అయితే ఇప్పటికే విద్యా సంవత్సరం సగం పూర్తై పోయింది. ఈ ఏడాది నుంచి తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేస్తారో లేదో స్పష్టత లేదు. ప్రస్తుతం రాష్ట్ర ఖజానా, రాబడి ఖర్చులకు సరిపోతోంది. జీతాల చెల్లించడానికి నిధులు సమీకరిసంచుకోవాల్సి వస్తోంది.

ఉచిత గ్యాస్ సిలిండర్లకు నిధుల కేటాయింపు..

సూపర్‌ సిక్స్‌ హామీలను నెరవేర్చడంలో భాగంగా 3ఎల్‌పిజి సిలిండర్లను ఉచితంగా అందించడానికి మొదటి విడత రూ.895కోట్లను కేటాయించినట్టు బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. ఇందులో ఇప్పటికే 5లక్షల మందికి గ్యాస్‌ రాయితీ చెల్లించినట్టు పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని త్వరల ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల మాటేమిటి?

టీడీపీ సూపర్‌ సిక్స్‌ ఎన్నికల హామీల్లో నగదు బదిలీతో ముడిపడిన పథకాలు ఐదు ఉన్నాయి. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని మినహాయిస్తే యువతకు నిరుద్యోగ భృతి, రైతులకు ఏటా ఆర్థిక సాయం, మహిళలకు ప్రతి నెల భృతి, తల్లికి వందనం వంటి హామీలు ఉన్నాయి.

రాష్ట్రంలో 20లక్షల మంది నిరుద్యోగ యువతీయువకులకు ప్రతి నెల రూ.3వేల నిరుద్యోగ భృతి చెల్లిస్తామని టీడీపీ-జనసేన హామీ ఇచ్చాయి. ప్రతిరైతుకు ఏటా రూ.20వేల ఆర్థిక సాయం అందిస్తామని పేర్కొన్నారు. రూ.18ఏళ్లు దాటిన ప్రతి మహిళకు ప్రతి నెల రూ.1500 చెల్లిస్తామని హామీ ఇచ్చారు.

ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలతో ముడిపడి ఉన్న ఎన్నికల హామీల విషమంలో కూటమి ప్రభుత్వం ఎలా ముందుకు వెళుతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆర్థిక అంశాలతో ముడిపడిన హామీలకు సంబంధించి కార్యాచరణ బడ్జెట్‌ ప్రసంగంలో కనిపించలేదు.

ఉచితం అనుచితం అంటూనే…

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షమ పథకాలు, నగదు బదిలీ పథకాలతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని అప్పట్లో విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ చేసి సంక్షేమం పేరుతో రాష్ఠ్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారని టీడీపీ మొదట్లో విమర్శించింది. వైసీపీ నగదు బదిలీ పథకాలపై నమ్మకంతో వై నాట్ 175 నినాదం అందుకున్న తర్వాత టీడీపీ వైఖరిలో మార్పు వచ్చింది. అప్పటికే ఆ పార్టీ కన్సల్టెంట్ల ప్రభావానికి గురి కావడంతో ఉచిత హామీల బాట పట్టింది. వైసీపీ హయాంలో ఏటా 60వేల కోట్ల రుపాయల నగదు బదిలీ చేశామని జగన్ చెప్పుకున్నారు. ఐదేళ్లలో రూ.2.7లక్షల కోట్లను ప్రత్యక్ష బదిలీ పథకాలకు వెచ్చించామని ఎన్నికల సభల్లో జగన్ చెప్పుకునే వారు. టీడీపీ ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే ఏటా లక్షన్నర కోట్లు అవసరం అవుతాయని విమర్శించే వారు.

దశల వారీగా అమలు చేసే అవకాశం..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో నగదు బదిలీ పథకాలను అమలు చేయడం అంత సులువు కాదని ఆర్థిక శాఖ చెబుతోంది. పథకాల అమలుకు కావాల్సిన నిధులను సమీకరించడం కత్తిమీద సాములా మారింది. ప్రభుత్వ ప్రాధాన్యతలు, అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, రాజధాని నిర్మాణం, పెట్టుబడులను ఆకర్షించడం వంటి అంశాలతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికల హామీలను అమలు చేయాల్సి ఉంటుంది.

2024-25 ఆర్థిక సంవత్సరంలో చివరి నాలుగు నెలల కాలానికి ప్రతిపాదించిన బడ్జెట్‌లో ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలకు కేటాయింపుల ప్రత్యేకంగా ప్రకటించకపోవడానికి ఇదే కారణమని భావిస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక వనరులు, ఆదాయంపై ప్రభుత్వానికి స్పష్టత వస్తుందని తద్వారా డిబిటి పథకాలపై క్లారిటీ రావొచ్చని చెబుతున్నారు. ఈలోపు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, నగదు బదిలీ పథకాల్లో కొన్నింటిని ప్రారంభించవచ్చని అంచనా వేస్తున్నారు.

శాఖల వారీగా కేటాయింపులు…

1.పర్యావరణం అటవీ శాస్త్ర సాంకేతిక శాఖకు రూ.687కోట్లను కేటాయించారు.

2.మాదక ద్రవ్యాల వినియోగ వ్యతిరేక టాస్క్‌ఫోర్స్‌లో 3172 యూనిట్లకు శిక్షణ ఇచ్చేందుకు పోలీస్ శాఖకు రూ.8,495కోట్లను కేటాయించారు.

3. పోలీస్ బలగాల ఆధునీకరణకు రూ.62కోట్లను కేటాయించారు. 13ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు.

4. పర్యాటక సాంస్కృతిక శాఖకు రూ.322కోట్ల కేటాయింపు

5. రోడ్లు భవనాల శాఖకుే రూ.9,554కోట్ల కేటాయింపు

6.రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.15వేల కోట్ల నిధులను కేంద్రం సహకారంతో సమీకరణ

7. ఇంధన శాఖకు రూ.8207కోట్ల కేటాయింపు

8. పరిశ్రమల శాఖకు రూ.3127 కోట్ల కేటాయింపు

9. జలవనరుల శాఖకు రూ.16,705కోట్ల కేటాయింపు

10. గృహ నిర్మాణ రంగానికి రూ.4102 కోట్ల కేటాయింపు

11. పురపాలక, పట్టణాభివృద్ధి శా‌ఖకు రూ.11,490కోట్లను కేటాయించారు.

12. పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి వాఖలకు రూ.16,739కోట్లను కేటాయించారు.

13. వైద్య ఆరోగ్య శాఖకు రూ.18,421 కోట్లను కేటాయించారు.

14. ఉన్నత విద్యాశాఖకు రూ.2,326 కోట్ల కేటాయింపు

15. పాఠశాల విద్యాశాఖకు రూ.29,909 కోట్ల కేటాయింపు

16. స్కిల్‌ డెవలప్‌బమెంట్‌ కోసం రూ.1215కోట్ల కేటాయింపు

17. మహిళా, స్త్రీ శిశు సంక్షేమ శాఖకు రూ.4,285కోట్ల కేటాయింపు

18. షెడ్యూల్ కులాల సంక్షేమం కోపం రూ.18,497కోట్లు, షెడ్యూల్ తెగల కోసం రూ.7557కోట్లు, బీసీ సంక్షేమానికి రూ.39,007కోట్లు, అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమానికి రూ.4376కోట్లు కేటాయించారు.

19.వ్యవసాయం అనుబంధ రంగాలకు రూ.11,855కోట్లను కేటాయించారు.

తదుపరి వ్యాసం