AP Assembly Live Updates: ఏపీ అసెంబ్లీ సమావేశాలు, 10 బిల్లులకు ఆమోదం
25 September 2023, 19:40 IST
- AP Assembly Live Updates: ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజుకు చేరాయి. మొదటి రెండు రోజులు టీడీపీ సభ్యుల ఆందోళనతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సభలో పలువురు టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు వేయడంతో సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించారు.
10 బిల్లులకు ఆమోదం, సభ రేపటికి వాయిదా
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మూడో రోజు కీలక బిల్లులను ఆమోదించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 10 బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అసైన్డ్ ల్యాండ్స్-భూముల రీసర్వేపై స్వల్పకాలిక చర్చ జరిగింది. చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఈ తీర్మానంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. అనంతరం సభ రేపటికి వాయిదా పడింది.
శాసనసభలో నాలుగు బిల్లులకు అమోదం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నాలుగు బిల్లులను శాసన సభ అమోదించింది. ఏపీ ప్రైవేట్ యూనివర్శిటీస్ సవరణ బిల్లు, ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సవరణ బిల్లు, గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ సవరణ బిల్లు-2023లకు సభ అమోదం తెలిపింది.
వాస్తవాలు వెలుగు చూస్తున్నాయన్న అంబటి
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రోజు రోజుకు వాస్తవాలు బయటికొస్తున్నాయని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు పిటిషన్లను కోర్టు తిరస్కరిస్తోందంటే పరిస్థితి అర్థమవుతోందని,సభలో చర్చకు రమ్మంటే సభ నుంచి పారిపోయారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో మీసాలు మెలేసి, తొడలు కొడుతున్నారని, - సాక్ష్యాధారాలతోనే చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసిందన్నారు. కేసు ఎంత బలంగా ఉందో అందరికీ అర్థమవుతోందని అన్యాయాలు, అక్రమాలతో చంద్రబాబు రాజ్యాధికారం చేశారని ఆరోపించారు. దొరికినవి కొన్నేఅని దొరకని స్కామ్ లు ఇంకా చాలానే ఉండొచ్చన్నారు. దొరికిన దొంగ ఇక తప్పించుకోలేడని, మంత్రి అంబటి రాంబాబు చెప్పారు.
రైతుల్ని బాబు మోసం చేశారన్న కాసు మహేష్
2014 ఎన్నికల్లో రైతు రుణమాఫీ చేస్తానంటూ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి మోసం చేశారని కాసు మహేష్ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ రైతు రుణాలపై జరిగిన చర్చలో అబద్దాలతో చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చారని ఆరోపించారు.
సమావేశాలను బహిష్కరించిన టీడీపీ
అసెంబ్లీ సమావేశాలను టీడీపీ బహిష్కరించింది. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో నేడు సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ భేటీకి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. అసెంబ్లీ సమావేశాలకు సమాంతర కార్యక్రమాల నిర్వహణపై చర్చిస్తారు. ప్రభుత్వ తీరుపై ప్రజాక్షేత్రం నుంచే సమాధానం చెబుతామని టీడీపీ చెబుతోంది. తదుపరి కార్యాచరణపై ఎన్టీఆర్ భవన్‍లో జరిగే టీడీఎల్పీ భేటీలో చర్చిస్తారు.
ప్రశ్నోత్తరాలు ప్రారంభం
ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని వ్యవసాయ మంత్రి కాకాణి ప్రారంభించారు. పంట రుణాలు, రైతు భరోసా కార్యక్రమాల అమలు తీరును సభ్యులకు వివరిస్తున్నారు.