తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Sc Sub Classification In Ap : 2026 సెన్సెస్ ప్రకారమే జిల్లాల వారీగా వర్గీకరణ - అసెంబ్లీలో కీలక ప్రకటన

SC Sub Classification in AP : 2026 సెన్సెస్ ప్రకారమే జిల్లాల వారీగా వర్గీకరణ - అసెంబ్లీలో కీలక ప్రకటన

Published Mar 20, 2025 09:11 PM IST

google News
    • ఎస్సీ వర్గీకరణపై మాట నిలబెట్టుకుంటున్నామని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. అసెంబ్లీలో మాట్లాడిన ఆయన… ఎన్నికల ప్రచారంలో వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పామని… అదే నిజం చేసి చూపించామన్నారు. 2026లో వచ్చే సెన్సెస్ ప్రకారం జిల్లా వారీగా వర్గీకరణ చేస్తామని ప్రకటించారు.
ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు

ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు

ఎస్సీ ఉపకులాల్లో సమన్యాయం కోసం సుప్రీంకోర్టు తీర్పు మేరకు వర్గీకరణ చేశామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడిన సీఎం చంద్రబాబు… ఎస్సీ వర్గీకరణపై ఎన్నికల సమయంలో చెప్పినట్లుగానే ఆ మాటను నిలబెట్టుకున్నామని వ్యాఖ్యానించారు. బుడగ జంగాలని ఎస్సీలో చేర్చాలని ఒక తీర్మానం చేసి,,, కేంద్రానికి పంపిస్తామని ప్రకటించారు. 2026లో వచ్చే సెన్సెస్ ప్రకారం, జిల్లా వారీగా వర్గీకరణ చేస్తామని తెలిపారు.


వివక్ష బాగా ఉండేది…

“ఏడుగురు జడ్జిల సుప్రీం కోర్టు బెంచ్ వర్గీకరణకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చింది. అది రాగానే మనం ఆర్ ఆర్ మిశ్రా కమిషన్ వేశాం. వారు అందరితో చర్చించి, ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అందరికీ సామాజిక న్యాయం జరిగేలా, మూడు కేటగిరీల్లో వర్గీకరణ చేయాలని రిపోర్ట్ వచ్చింది. 1995లో నేను ముఖ్యమంత్రి అయ్యాక ఎస్సీల పట్ల వివక్ష బాగా ఉండేది. అంటరానితనం నిషేధానికి జస్టిస్ పున్నయ్య కమిషన్‍ను నేనే వేశాను. అంటరానితనం రూపుమాపడానికి ఎన్నో జీవోలు జారీ చేశాం. ఎస్సీల కోసం జస్టిస్ పున్నయ్య ఎంతో చిత్తశుద్ధితో పనిచేశారు” అని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు.

“హోటళ్లలో రెండు గ్లాసుల విధానం ఉండేది, మంచినీటి బావుల వద్ద వివక్ష ఉండేది. దేవాలయాలకు ఎంట్రెన్స్ లేని పరిస్థితి. ఇవన్నీ చూసిన తరువాత చట్టాలు చేశాం. అంటరానితనం, కుల వివక్ష పైన ఒక యుద్ధం చేసాం. ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారానికి ఎస్సీ, ఎస్టీ సెల్ ఏర్పాటు చేశాం. సాంఘిక సమానత్వంపై ఎన్నో అవగాహన సదస్సులు నిర్వహించాం. ప్రతినెల, ప్రతిగ్రామంలో పౌరహక్కుల దినోత్సవం నిర్వహించాం” అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.

నా అదృష్టం - సీఎం చంద్రబాబు

“సామాజిక న్యాయం కోసం పరితపించిన మహనీయుడు ఎన్టీఆర్. దేశంలోనే మొదటి సారి ఎస్సీ, ఎస్టీలకు శాశ్వత గృహనివాస పథకంలో 50 శాతం రిజర్వేషన్ తీసుకువచ్చిన మొదటి వ్యక్తి ఎన్టీఆర్. మొదటి సారి ఈ దేశంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టిన వ్యక్తి ఎన్టీఆర్. ఎస్సీ వర్గీకరణ సాకారం కావడంలో నా ప్రయాణం కూడా సుదీర్ఘంగా సాగింది. మొదటి కమిటీ వేసినప్పటి నుంచి సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకు, ఇప్పుడు వర్గీకరణ అమలు చేసే వరకు ఉండటం నా అదృష్టం” అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

“ఎస్సీల కోసం రూ.8400 కోట్లతో ఆర్థిక చేయూత పథకాలు తీసుకువచ్చాం. గతంలోనూ మాల, మాదిగ సామాజిక వర్గాలకు దామాషా ప్రకారం నిధులు కేటాయించాం. మా ఈ ఎన్డీఏ ప్రభుత్వం అందరికీ సామాజిక న్యాయం చేయటానికి కట్టుబడి ఉంది. జిల్లాల వారీగా కేటగిరీల విభజన చేయాల్సి ఉంటుంది. జనగణన తర్వాత మరోసారి జిల్లాల వారీగా కేటగిరీల విభజన చేసేందుకు సిద్ధంగా ఉన్నాం ” అని చంద్రబాబు చెప్పారు.

“లోక్‍సభ స్పీకర్‍గా ఒక దళితుడిని చేసిన పార్టీ తెలుగుదేశం. దళిత మహిళను శాసనసభ స్పీకర్‍గా చేసిన ఘనత కూడా టీడీపీదే. ఎస్సీ అయిన కాకి మాధవరావును సీఎస్ చేసిన ఘనత కూడా టీడీపీదే. నేను యునైటెడ్ ఫ్రంట్ ఛైర్మన్ గా ఉన్నప్పుడు ఎస్సీ అయిన కేఆర్ నారాయణన్‍ను రాష్ట్రపతిని చేశాం. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఎస్సీ, ఎస్టీలకు కీలక పదవులు ఇచ్చింది. గతంలో ఎస్సీ అయిన రామ్‍నాథ్ కోవింద్‍ను రాష్ట్రపతిగా చేశారు. ఇప్పుడు ఎస్టీ అయిన ద్రౌపదీముర్మును రాష్ట్రపతిగా చేసింది. అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి అవ్వటానికి మద్దతు ఇచ్చాం. వీటిల్లో భాగస్వామ్యం అయినందుకు సంతోషంగా ఉంది” అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు.