AIIMS Trauma Care: మంగళగిరి ఎయిమ్స్‌కు మరో పది ఎకరాల భూ కేటాయింపు, జాతీయ రహదారిపై ట్రామా కేర్ ఏర్పాటు
Published Feb 10, 2025 10:29 AM IST
- AIIMS Trauma Care: మంగళగిరి ఎయిమ్స్‌కు చెన్నై-కోల్‌కత్తా జాతీయ రహదారిపై మరో పది ఎకరాల భూమిని కేటాయించేందుకు ఏపీ ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. కొలనుకొండ వద్ద జాతీయ రహదారిపై ఉన్న భూమిని ఎయిమ్స్ ట్రామా కేర్ ఏర్పాటుకు కేటాయించనున్నారు.
మంగళగిరి ఎయిమ్స్‌కు మరో పది ఎకరాల భూమి కేటాయింపు
AIIMS Trauma Care: మంగళగిరి ఎయిమ్స్ అభివృద్ధికి పూర్తి సహకారాన్ని అందిస్తామని, ఎయిమ్స్ డైరెక్టర్ కు వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ హామీ ఇచ్చారు. ఎయిమ్స్ ట్రామా కేర్ ఏర్పాటు చేసేందుకు పది ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించనున్నట్టు మంత్రి తెలిపారు. న మంగళగిరి ఎయిమ్స్ డైరెక్టర్ మంత్రి సత్యకుమార్‌తో భేటీలో ఈ విషయం వెల్లడించారు.
మంగళగిరి ఎయిమ్స్‌ను దేశంలోనే అత్యున్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలందిస్తుందని నూతన ఎయిమ్స్ డైరెక్టర్ ఆచార్య అహంతేమ్ శాంతాసింగ్ కు వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ హామీ ఇచ్చారు.
భౌగోళికంగా మంగళగిరిలోని సుందరమైన, ఆహ్లాదభరితమైన కొండల నడుమ ఎయిమ్స్ ను కేంద్రప్రభుత్వం నెలకొల్పిందని, 2018లో ప్రారంభమైన దీనికి గత ప్రభుత్వ హయాంలో మంచి నీటి సౌకర్యాన్ని కూడా కల్పించలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ సమస్యను పరిష్కరించిందని, అలాగే ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరాను కూడా కల్పించిందన్నారు.
183 ఎకరాల్లో ఏర్పాటైన ఎయిమ్స్ లో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటుకు స్థలం లేనందున, కొలనుకొండలో 10 ఎకరాల స్థలాన్ని మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవలే ఆదేశాలిచ్చారని మంత్రి తెలిపారు. త్వరితగతిన ట్రామాకేర్ సెంటర్‌ను నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని, అలాగే 965 పడకల ఆసుపత్రిగా మంజూరైన ఎయిమ్స్ లో ప్రస్తుతం 650 పడకలున్నాయని, విస్తరణకు తగు చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ శాంతాసింగ్‌కు ఈ సందర్భంగా మంత్రి సూచించారు. మంగళగిరి ఎయిమ్స్ అభివృద్ధికి భవిష్యత్తులో అన్ని విధాలా సహకరించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
జాతీయ రహదారిపై ట్రామా కేర్ ఏర్పాటు..
గుంటూరు జిల్లా మంగళగిరిలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఎయిమ్స్ లో ట్రామా కేర్ సెంటర్ నిర్మాణం కోసం జాతీయ రహ దారి పక్కన ఉన్న 10ఎకరాల భూమిని కేటాయించేం దుకు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం 183 ఎకరాల్లో నిర్మించిన ఎయిమ్స్‌లో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు కాలేదు. దీని అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం ఎయిమ్స్ కు వెళ్లే దారిలో 16వ నంబరు జాతీయ రహదారి పక్కనే కొలనుకొండ గ్రామ పరిధి లోని సర్వే నంబరు 19లోని మునుగోడు దిబ్బ (కొండ) సమీపంలో 10 ఎకరాల భూమిని కేటాయించాలని నిర్ణయించారు.
ట్రామా కేర్ సెంటర్‌ను యుద్ధప్రాతిపదికపై ఏర్పాటు చేయాలని ఎయిమ్స్ నూతన డైరెక్టర్ ఆహంతేమ్ శాంతాసింగు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. అత్యవసర సమయాల్లో రోగులకు నాణ్యమైన సేవల్ని అందించేందుకు ట్రామా కేర్ ఉపయోగపడుతుంది.