August 30 Telugu News Updates : మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్
30 August 2022, 22:59 IST
- ఏపీలో రాజకీయ పొత్తులపై బీజేపీ క్లారిటీ ఇచ్చేసింది. బీజేపీకి టీడీపీ దగ్గరవుతోందన్న ఊహాగానాలకు చెక్ పెట్టేసింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, వైసీపీలతో ఎలాంటి పొత్తులు ఉండవని తేల్చేశారు. సొంతంగా 175 నియోజక వర్గాల్లో ఎదగడమే బీజేపీ లక్ష్యమని కాషాయ పార్టీ స్పష్టం చేస్తోంది.
ఆధార్‌తో ఓటరు కార్డును అనుసంధానం చేసుకోవాలి
పౌరులంతా ఆధార్‌తో ఓటరుకార్డును అనుసంధానం చేసుకోవాలని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పిలుపునిచ్చారు. ఓటరు కార్డు, ఆధార్ కార్డు అనుసంధానం తప్పనిసరి కాదని, కానీ తమవంతు బాధ్యతగా ఈ ప్రక్రియలో పాలు పంచుకోవాలని కోరారు.
8 కోట్ల విలువైన విదేశి సిగరేట్లు స్వాధీనం
విజయవాడలో భారీ ఎత్తున విదేశీ సిగరేట్లు లభ్యమయ్యాయి. అక్రమంగా రవాణా చేస్తున్న 8 కోట్ల రూపాయలు విలువ చేసే విదేశీ సిగరెట్లను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. తమిళనాడు, బిహార్ రాష్ట్రాలకు చెందిన లారీల్లో స్మగ్లింగ్ జరుగుతున్నట్టుగా గుర్తించారు.
వచ్చేది టీడీపీ ప్రభుత్వమే
ఏపీలో రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని నారా లోకేశ్ అన్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తున్న పోలీసులను వదిలిపెట్టమని చెప్పారు. పోలీసులు వైసీపీ ఏజెంట్లుగా పని చేస్తున్నారని విమర్శించారు. ఇటీవల వైసీపీ నేతలు పెట్టిన కేసులతో అరెస్టయి చిత్తూరు సబ్ జైలులో ఉన్న టీడీపీ నాయకులను ములాఖత్ ద్వారా ఆయన పరామర్శించారు.
మీడియాను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట
మీడియాను, దానికి సంబంధించిన వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. అలాంటి వారితో పోరాటంలో జాగ్రత్తగా వ్యవహరించాలని పేర్కొన్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సోషల్ మీడియా సమావేశంలో కార్యకర్తలకు సూచనలు చేశారు. టీడీపీ అనేది తుప్పుపట్టిపోయిన పార్టీ అని విమర్శించారు. దాని పని అయిపోయిందన్నారు. అందుకే సోషల్ మీడియా, వాళ్లకు ఉన్న మీడియాల ద్వారా అబద్ధాలను ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
జీవ 246 రద్దు చేయకుంటే దీక్షగు దిగుతా
తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నీటి కేటాయింపులపై జారీ చేసిన జీవో 246 రద్దు చేయాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది ఏళ్లుగా తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తోందన్నారు. ఈ నెల 18న ఈ జీవో జారీ చేసిందన్నారు. నల్గొండ జిల్లాకు తీవ్ర అన్యాయం చేసే విధంగా ఉందని మండిపడ్డారు. జీవోను రద్దు చేయకపోతే.. వెంటనే జిల్లా కేంద్రంలో దీక్షకు దిగుతానని చెప్పారు.
సీఎం వినాయక చవితి శుభాకాంక్షలు
ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు సీఎం జగన్. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మంచి పనులకు విఘ్నాలు తొలగిపోవాలన్నారు. ప్రజలందరికీ శుభాలు కలగాలని, విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు. అలాగే గణనాథుని కరుణాకటాక్షాలతో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు.
మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్
టీఆరెఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నట్టు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. డాక్టర్ల సలహా మేరకు ఐసోలేషన్ లో ఉన్నారు. కొన్ని రోజులుగా తనను కలిసిన వారందరు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
మరో నేతపై పీడీ యాక్ట్
హైదరాబాద్ నగర పోలీసులు మరో నేత పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఎంఐఎం నేత కషఫ్‌పై పీడీ యాక్ట్ ప్రయోగించారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగానూ పీడీ యాక్ట్ నమోదు చేశారు.
గుడిసెల తొలగింపు ఉద్రిక్తత
వరంగల్ జిల్లా బొల్లికుంటలో గుడిసెల తొలిగింపు వివాదానికి దారితీసింది. ప్రభుత్వ స్థలంలో కొంతమంది సీపీఐ ఆధ్వర్యంలో కొన్ని నెలల కిందట గుడిసెలు వేసుకున్నారు. ఇప్పుడు అధికారులు అక్రమంగా తమ గుడిసెలు తొలగించారంటూ వరంగల్ ఖమ్మం జాతీయ రహాదారిపై బాధితులు ధర్నా చేపట్టారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జగన్‌ను కలిసిన టాటా కంపెనీ ప్రతినిధులు
సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్‌ను టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ ప్రతినిధులు కలిశారు. టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ కార్పొరేట్ ఎఫైర్స్, రెగ్యులేటరీ హెడ్ జే. శ్రీధర్, టాటా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ హెడ్ మసూద్ హుస్సేనీ కలిసిన వారిలో ఉన్నారు. ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై చర్చ జరిగింది. రక్షణ వైమానిక రంగంలో తయారీ, నిర్వహణ తదితర అంశాల్లో పెట్టుబడులు, అవకాశాలపై చర్చించారు. ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్ధంగా ఉన్నామన్న సీఎం జగన్ తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను వివరించారు.
ఎస్పీ ఫక్కిరప్పపై ఏఆర్ కానిస్టేబుల్ ఫిర్యాదు
ఓ మహిళ చేత తప్పుడు వాంగ్మూలాన్ని తీసుకొని తనని ఉద్యోగం నుంచి తొలగించారని అనంతపురానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ భానుప్రకాష్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతపురంలోని రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ధర్మవరం డీఎస్పీ రమాకాంత్, సీసీఎస్ డీఎస్పీ మహబూబ్ బాషా, అడిషనల్ ఎస్పీ హనుమంతప్ప, ఎస్పీ ఫక్కీరప్పపై ఫిర్యాదు చేశాడు. మహిళను బెదిరించి తనపై కుట్ర చేసి తప్పుడు వాంగ్మూలం తీసుకున్నారని ఫిర్యాదులో చెప్పాడు.
సెప్టెంబర్ 1 నుంచి మునుగోడులో కాంగ్రెస్ క్షేత్రస్థాయి పర్యటనలు
సెప్టెంబర్ 1 నుంచి మునుగోడులో క్షేత్ర స్థాయి పర్యటనలు చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ లు ప్రజా సమస్యలు చర్చ జరగకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తు్న్నాయన్నారు. కొందరు నేతలు పార్టీ మారుతూ పార్టీపై అనవసర విమర్శలు చేస్తున్నారు. ప్రజా ప్రతినిధుల కొనుగోలు కోసం టీఆర్ఎస్, బీజేపీలు కమిటీలు వేశాయన్నారు. మునుగోడులో నేతల కొనుగోలు పక్రియ జరుగుతుందన్నారు. మునుగోడులో నాయకుల జేబులు నిండాయి తప్ప ..ప్రజా సమస్యలు పరిష్కారం కాలేదన్నారు.
ఐదు లక్షల పరిహారం
తెలంగాణలోని ఇబ్రహీంపట్నం సామాజిక ఆరోగ్య కేంద్రం ఘటనలో దర్యాప్తు కోసం ప్రత్యేక కమిటీని నియమించినట్లు ప్రజారోగ్య సంచాలకులు డా.శ్రీనివాస్‌రావు చెప్పారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం అందిస్తున్నట్టుగా వెల్లడించారు. ఇబ్రహీంపట్నం ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేశామన్నారు. శస్త్రచికిత్సలు చేసిన వైద్యుడి లైసెన్సును తాత్కాలికంగా రద్దు చేసి సస్పెండ్ చేసినట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు డబుల్ బెడ్‌రూం ఇల్లు మంజూరు చేయడంతో పాటు వారి పిల్లల బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.
కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి 4 గురు మృతి
రంగారెడ్డి జిల్లాలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి ఘటనలో మృతుల సంఖ్య 4కి చేరింది. ఇబ్రహీంపట్నంలో వరుసగా 3 రోజుల్లో నలుగురు మహిళలు మృతి చెందారు. ఈనెల 25న 34 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబాలు ఆందోళనకు దిగాయి.
ఏపీలో టీచర్లకు పదోన్నతి
ఏపీ లో 10 వేల మంది టీచర్లకు పదోన్నతి లభించింది. డిప్యూటీ డీఈవో, ఎంఈవో, హెచ్‌ఎమ్‌లుగా ప్రమోషన్లు వచ్చాయి. టీచర్ల పదోన్నతుల కోసం అదనంగా 666 ఎంఈవో, 36 డిప్యూటీ డీఈవో పోస్టులు మంజూరు చేశారు. 2,300 మంది టీచర్లకు సబ్జెక్టు మార్పు అవకాశం ఉంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ దూకుడు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ దూకుడు పెంచింది. సిసోడియా బ్యాంక్ లాకర్ సీబీఐ అధికారులు ఓపెన్ చేవారు. సిసోడియా బ్యాంక్ అకౌంట్ ను తనిఖీ చేస్తున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో సిసోడియాకు లాకర్లు ఉండటంతో సిసోడియా బ్యాంకు లావాదేవీలను సీబీఐ అధికారులు పరిశీలిస్తున్నారు.
గురజాల పీఎస్ లో పురుగులమందు తాగిన నిందితుడు
గురజాల పోలీసుస్టేషన్ ఆవరణలోనే నిందితుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వైసీపీ నాయకుడితో జరిగిన ఘర్షణలో మహంకాళి రాజుపై కేసు నమోదు చేశారు. పోలీసుల వేధింపులతోనే ఆత్మహత్యా యత్నం చేసుకున్నాడని బంధువుల ఆరోపిస్తున్నారు. పదే పదే పీఎస్ కు పిలుస్తుండటంతో మనస్తాపం చెందినట్లు ఆరోపించారు. గురజాల ప్రభుత్వాస్పత్రికి నిందితుడిని తరలించారు.
సెప్టెంబర్ 3న టిఆర్‌ఎస్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం
సెప్టెంబర్ 3 వ తేదీ క్యాబినెట్ సమావేశం తర్వాత తెలంగాణ భవన్‌లో సాయంత్రం 5 గంటలకు టిఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. టిఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ అధ్యక్షతన సాగే ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపీలు కూడా పాల్గొంటారు. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, నూతనంగా అమలు చేస్తున్న పెన్షన్లు, గిరిజనులకు పోడు భూములు,తదితర అంశాలపై సమావేశంలో చర్చిస్తారు.
విద్యుత్ బిల్లుల వివాదంపై సిఎం కేసీఆర్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్‌కు రూ.6వేల కోట్ల విద్యుత్ బకాయిలను చెల్లించాలని కేంద్ర విద్యుత్ శాఖ ఆదేశించడంపై విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సిఎం కేసీఆర్ సమీక్ష జరుపుతున్నారు. కేంద్ర ఆదేశాలు ఏకపక్షంగా ఉన్నాయని తెలంగాణ భావిస్తోంది. మరోవైపు ఏపీ నుంచి తెలంగాణకు 12వేల కోట్లు రావాల్సి ఉందని తెలంగాణ వాదిస్తోంది. జిపిఎఫ్, పెన్షన్ ఫండ్, కర్నూల్, అనంతపురంలలో వినియోగించిన నెట్‌వర్క్ డెవలప్మెంట్ నిధుల విషయాన్ని తేల్చాలని వాదిస్తోంది. దీంతో పాటు కృష్ణపట్నం పవర్ ప్లాంట్ నుంచి రావాల్సిన విద్యుత్ అంశాలను పరిష్కరించాలని గుర్తు చేస్తున్నారు. ఉద్యోగుల సంక్షేమ నిధి, పవర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా ఖర్చు చేసిన నిధుల అంశాన్ని తెలంగాణ తెరపైకి తెచ్చింది.
ఏపీలో ఉపాధ్యాయులకు పదోన్నతులు
ఆంధ్రప్రదేశ్‌లో 10 వేల మందికి పైగా టీచర్లకు పదోన్నతి కల్పించేందుకు రంగం సిద్ధమైంది. డిప్యూటీ డీఈవో, ఎంఈవో, హెచ్‌ఎమ్‌లుగా ప్రమోషన్లు కల్పించనున్నారు. టీచర్ల పదోన్నతుల కోసం అదనంగా 666 ఎంఈవో, 36 డిప్యూటీ డీఈవో పోస్టులు దక్కనున్నాయి. 2,300 మంది టీచర్లకు సబ్జెక్టు మార్పు అవకాశం కల్పిస్తారు. 22 ఏళ్ల సమస్యకు పరిష్కారం చూపిన సీఎం జగన్ మోహన్ రెడ్డి పరిష్కారం చూపారని విద్యాశాఖ చెబుతోంది. సెప్టెంబర్‌లో పదోన్నతులు కల్పించిన తర్వాత టీచర్ల బదిలీలు చేపడతారు.
కుని ఆపరేషన్లు వికటించి నలుగురి మృతి
కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించిన ఘటనలో మృతుల సంఖ్య 4కు చేరింది. ఇబ్రహీంపట్నంలో వరుసగా 3 రోజుల్లో నలుగురు మహిళలు మృతి చెందారు. ఈనెల 25న 34 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోగా అవి వికటించి మహిళలు మృతి చెందుతున్నారు. న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబాలు ఆందోళనకు దిగాయి.
బైండోవర్ కేసులపై ఎమ్మెల్సీల ఆగ్రహం
ఉపాధ్యాయులపై బైండోవర్ కేసులు నమోదు చేయడాన్ని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణ ఉపాధ్యాయులను పీఎస్‍లకు పిలిపించి వేధించడంపై మండిపడుతున్నారు. హక్కుల కోసం నిరసన తెలిపితే కక్షసాధింపు చర్యలు చేపడుతున్నారని ఆరోపించారు. సీపీఎస్ రద్దు హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని, అక్రమ నిర్బంధాలకు నిరసనగా సెప్టెంబర్ 1న రాష్ట్రవ్యాప్త నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. జిల్లా, మండల స్థాయిల్లోనూ నిరసనలు తెలిపాలని సూచించారు. ఉపాధ్యాయులను నిర్బంధిస్తే కుటుంబసభ్యులతో కలిపి ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. ఓపీఎస్ పునరుద్ధరణ కోసం ఉద్యమిస్తామని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ప్రకటించారు.
టీచర్ల అరెస్ట్
సీపీఎస్ రద్దు కోరుతూ చలో విజయవాడకు బయలుదేరిన పలువురు ఉపాధ్యాయులను అనంతపురంలో అదుపులోకి తీసుకున్నారు. తాడిపత్రిలో ఐదుగురు టీచర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. - సీఎం ఇంటి ముట్టడికి వెళ్తున్నారనే అనుమానంతో వారిపై చర్యలు తీసుకున్నారు. అర్థరాత్రి వరకు టీచర్లు పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. వారిపై బైండోవర్ కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చి పంపారు.
తిరుమలలో భక్తుల రద్దీ
తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం ఐదు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుండగా, నిన్న శ్రీవారిని 67,950 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,407 మంది భక్తులు - తలనీలాల సమర్పించారు. సోమవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.74 కోట్లు వచ్చింది.
కృష్ణాకు పోటెత్తిన వరద
ప్రకాశం బ్యారేజ్‍కు మరోసారి వరద పోటెత్తుతోంది. 20 గేట్లను 8 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 30 గేట్లను 7 అడుగుల మేర ఎత్తి నీరు విడుదల చేశారు. కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
అన్నా క్యాంటీన్ ధ్వంసం….
కుప్పంలో రాజకీయ ఘర్షణలు కొనసాగుతున్నాయి. టీడీపీ నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ దుండగులు ధ్వంసం చేశారు. కుప్పం ఆర్టీసీ బస్టాండ్ కూడలి వద్ద గత 86 రోజులుగా అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నారు. గత వారం చంద్రబాబు కుప్పంలో పర్యటన సందర్భంగా వైసీపీ, టీడీపీల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు జరిగాయి. అన్నాక్యాంటీన్‌ను అడ్డుకుంటున్నారంటూ చంద్రబాబు నిరసనకు సైతం దిగారు. తాజాగా ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన బ్యానర్లను దుండగులు ధ్వంసం చేశారు.
విద్యుత్ బకాయిలు చెల్లించండి
ఆంధ్ర ప్రదేశ్‌కు చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలు వెంటనే చెల్లించాలని తెలంగాణకు కేంద్రం ఆదేశించింది. తెలంగాణ డిస్కంలు ఏపీకి చెల్లించాల్సిన బకాయిలు తక్షణమే చెల్లించాలని ఆదేశించారు. పునర్విభజన చట్టం ప్రకారం విద్యుత్ బకాయిలు చెల్లించాలన్న కేంద్రం ఆదేశించింది. 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకు ఏపీ డిస్కంలు సరఫరా చేసిన విద్యుత్‌కు తెలంగాణ బకాయిలు చెల్లించాలని కేంద్రం ఆదేశించింది. ఏపీకి చెల్లించాల్సిన రూ.3,441.78 కోట్ల బకాయిలతో పాటు, ఆలస్య రుసుం మరో రూ.3,315 కోట్లు చెల్లించాలని కేంద్రం ఆదేశించింది. 30 రోజుల్లోగా చెల్లింపులు పూర్తి చేయాలని కేంద్ర విద్యుత్‍శాఖ తెలంగాణను ఆదేశించింది.