America Vice President : అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆంధ్ర అల్లుడు, భర్త విజయంలో ఉషా చిలుకూరి కీలక పాత్ర
06 November 2024, 22:05 IST
America Vice President : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ విజయం సాధించింది. డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికలయ్యారు. ఆయన తన వైస్ ప్రెసిడెంట్ గా ఆంధ్ర అల్లుడు జేడీ వాన్స్ ను ఎన్నుకున్న విషయం తెలిసిందే. జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరి తల్లిదండ్రులు ఏపీకి చెందిన వారు.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆంధ్ర అల్లుడు, భర్త విజయంలో ఉషా చిలుకూరి కీలక పాత్ర
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఘన విజయం సాధించింది. డోనాల్డ్ ట్రంప్ రెండోసారి యూఎస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే ఆంధ్ర అల్లుడు అమెరికా ఉపాధ్యక్షుడు కాబోతున్నారు. రిపబ్లిక్ పార్టీ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆంధ్ర అల్లుడు. జేడీ వాన్స్ భార్య ఉషా ఏపీకి చెందిన వారు. ఉషా చిలుకూరి విశాఖలోని సెంచూరియన్, ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా చేసిన శాంతమ్మ మనుమరాలు ఉషా చిలుకూరి. అమెరికా ఉపాధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి జేడీ వాన్స్ ఎన్నికవ్వడంతో ఆయన భార్య ఉషా చిలుకూరి సైతం వార్తల్లో నిలిచారు.
తన మనవరాలి భర్త జేడీ వాన్స్‌ను అమెరికా ఉపాధ్యక్షుడు కావడంపై శాంతమ్మ హర్షం వ్యక్తం చేశారు. ఉషా తల్లిదండ్రులు ఎప్పుడో అమెరికాలో స్థిరపడ్డారని, ఆమె అక్కడే పుట్టి పెరిగిందని శాంతమ్మ అన్నారు. చెన్నైలో డాక్టర్ గా పనిచేస్తున్న ఉషా మేనత్త శారద... ఉషా, వాన్స్ పెళ్లికి హాజరయ్యారని శాంతమ్మ తెలిపారు. తమ బంధువులు అమెరికాలో స్థిరపడి వివిధ సంస్థల్లో ఉన్నత స్థానాల్లో పనిచేస్తున్నారన్నారు. ఉషా దంపతులు ఈ స్థాయికి వెళ్లారని తెలియగానే తనకు ఎంతో గర్వంగా అనిపించిందన్నారు. వారిద్దరికీ తన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని శాంతమ్మ అన్నారు.
కృష్ణా జిల్లాలోని సాయిపురం స్వగ్రామం
ఉషా చిలుకూరి స్వగ్రామం ...కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం సాయిపురం. ఉషాకు తాత వరుసయ్యే రామ్మోహనరావు కుటుంబం ప్రస్తుతం ఈ గ్రామంలోనే నివసిస్తున్నారు. ఉషా పూర్వీకులు దశాబ్దాల కిందటే ఇతర ప్రాంతాలకు వెళ్లి స్థిరపడ్డారని వారి బంధువులు అంటున్నారు. ఉషా మేనత్త శారద చెన్నైలో నివాసం ఉంటూ వైద్యురాలిగా పనిచేస్తున్నారు. ఉషా తండ్రి రాధాకృష్ణ ఏరో నాటికల్ ఇంజినీరింగ్ పూర్తి శాన్‌డియాగో విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. ఆయన పామర్రుకు చెందిన లక్ష్మిని వివాహం చేసుకున్నారు. వీరి సంతానమే ఉషా.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ గెలిచింది. దీంతో అగ్రరాజ్యం అమెరికాకి తెలుగింటి అమ్మాయి చిలుకూరి ఉషా సెకండ్ లేడీ అయ్యారు. అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్.. వైస్ ప్రెసిడెంట్ గా గా ఒహాయో రిపబ్లికన్ సెనేటర్, ఆంధ్ర అల్లుడు జేడీ వాన్స్ ను ఎంచుకున్నారు. 39 ఏళ్ల జేడీ వాన్స్ తెలుగు మూలాలున్న అమ్మాయి ఉషాను వివాహం చేసుకున్నారు. మిల్వాకీలో జరిగిన రిపబ్లిక్ పార్టీ సమావేశంలో డోనాల్డ్ ట్రంప్ జేడీ వాన్స్ పేరును ఉపాధ్యక్ష పదవికి ప్రకటించిన విషయం తెలిసిందే.
ట్రంప్ పై హత్యాప్రయత్నం జరిగినప్పుడు జేడీ వాన్స్ స్పందించారు. ఈ కుట్రలో జో బైడెన్ పాత్ర ఉండవచ్చునని ట్వీట్ చేశారు. గతంలో ట్రంప్ పై విమర్శలు చేసిన జేడీ వాన్స్... అనంతరం ట్రంప్ కు మద్దతుదారుడిగా మారారు. జేడీ వాన్స్ సతీమణి ఉషా చిలుకూరి ఒకప్పుడు డెమెక్రటిక్ పార్టీ సభ్యురాలు. కొన్నేళ్ల కిందట ఆ పార్టీకి రాజీనామా చేసి రిపబ్లికన్ పార్టీలో చేరారు. నేషనల్ లీగల్ ఏజెన్సీలో ఉషా లిటిగేటర్ పనిచేస్తున్నారు.
ఆంధ్ర టు అమెరికా
ఉషా చిలుకూరి తల్లిదండ్రులు చాలా ఏళ్ల కిందట ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికాలోని కాలిఫోర్నియా వెళ్లి స్థిరపడ్డారు. ఉషా కాలిఫోర్నియాలోనే పుట్టారు. శాన్ డియాగో, కాలిఫోర్నియాలో పెరిగిన ఆమెకు ప్రస్తుతం 38 ఏళ్లు. ఆమె రాంచో పెనాస్క్విటోస్‌లోని మౌంట్ కార్మెల్ హై స్కూల్‌లో చదివారు. యేల్ విశ్వవిద్యాలయం నుంచి చరిత్రలో బీఏ చేసి, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఆధునిక చరిత్రలో ఎంఫిల్ పట్టా పొందారు. యేల్ యూనివర్శిటీలో జేడీ వాన్స్ తో ఉషాకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం పెళ్లి వరకు వచ్చింది.
2014లో వివాహం
ఎంఫిల్ పూర్తైన తర్వాత 2018లో అమెరికా సుప్రీం కోర్టు లా క్లర్క్‌గా చేరారు ఉషా. ఆ తర్వాత శాన్‌ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్ డీసీలోని ముంగెర్, టోల్లెస్, ఓల్సన్ లో పనిచేశారు. ఉషా చిలుకూరికి 2013లో యేల్ వర్సిటీలో జేడీ వాన్స్‌తో పరిచయం ఏర్పడింది. 2014లో వీరి వివాహం జరిగింది. పెళ్లి కాలిఫోర్నియాలో హిందూ సంప్రదాయం ప్రకారమే జరిగినట్టు ఉషా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. జేడీ వాన్స్, ఉషా దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. ఉషా కుటుంబ సభ్యులు కాలిఫోర్నియాలో నివశిస్తున్నారు.
భర్త జేడీ వాన్స్ రాజకీయ ప్రయాణంలో ఉషా కీలకంగా వ్యవహరించారు. వీరిద్దరూ తరచూ రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. భర్త రాజకీయ నిర్ణయాలకు ఆమె పూర్తి మద్దతు తెలిపేవారు. 2016లో వాన్స్ తొలిసారి సెనేటర్ గా పోటీ చేశారు. 2022లో వాన్స్ తిరిగి పోటీ చేసి గెలిచినప్పుడు ఉషా కీలక పాత్ర పోషించారు. తాజా ఎన్నికల్లో ఉషా చిలుకూరి కీలకంగా వ్యవహరించి భర్త విజయంలో కీలకంగా మారారు.