Amaravati Tenders : అమరావతిపై ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం-సీఆర్డీఏ పాత టెండర్లు రద్దు, కొత్త వాటికి లైన్ క్లియర్
04 November 2024, 23:01 IST
Amaravati Tenders : ఏపీ రాజధాని అమరావతిపై ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. గత టీడీపీ హయాంలో ఇచ్చిన పాత టెండర్లను సీఆర్డీఏ రద్దు చేసింది. త్వరలో కొత్త టెండర్లను పిలిచేందుకు తీర్మానం చేసింది.
అమరావతిపై ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం-సీఆర్డీఏ పాత టెండర్లు రద్దు, కొత్త వాటికి లైన్ క్లియర్
అమరావతి పాత టెండర్లను రద్దు చేస్తూ సీఆర్డీఏ తీర్మానం చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. దీంతో కొత్త టెండర్లు పిలవడానికి లైన్ క్లియర్ అయిందన్నారు. 39వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో రాజధాని అమరావతి నిర్మాణానికి పలు కీలకమైన అంశాలపై నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా రాజధాని 217చ.కి.మీ పరిధిలో కెనాల్స్ తోపాటు క్యాపిటల్ సిటీకి బయట కూడా కొన్ని రిజర్వాయర్ల నిర్మాణానికి నెథర్లాండ్స్ ఇచ్చిన నివేదికను అథారిటీ ఆమోదించింది.
సీఆర్డీఏ సమావేశం
సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ 39వ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్ హాజరై రాజధాని అమరావతికి సంబంధించిన పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. నెదర్లాండ్ సూచన మేరకు కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్, తో పాటు పలు రిజర్వాయర్ల నిర్మాణానికి సీఆర్డీఏ నిర్ణయం తీసుకుంది.
ఈ సమావేశం అనంతరం మంత్రి నారాణయ మీడియాతో మాట్లాడారు. 2014-19 మధ్య అమరావతి రాజధాని ప్రాంతంలోని ఆరు లేన్ల రోడ్లు, అసెంబ్లీ, మంత్రులు, అధికారులు, న్యాయమూర్తుల భవనాలు, ఇతర పనులకు రూ.41 వేల కోట్ల అంచనాల వేశామన్నారు. అప్పట్లో 38 వేల కోట్లకు టెండర్లు పిలిచామన్నారు. వీటిల్లో కొన్నింటికి అడ్వాన్ లు ఇచ్చామన్నారు. గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వం అమరావతి పనులు చేయకపోవడం వల్ల ఈ టెండర్ల గడువు ముగిసిందన్నారు. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల పేరిట మూడు ముక్కలాట ఆడిందన్నారు.
పాత టెండర్లు రద్దు
అమరావతి రాజధాని టెండర్ల ప్రక్రియపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చీఫ్ ఇంజినీర్లతో జులైన 24న సాంకేతిక కమిటీ వేశామన్నారు. ఈ కమిటీ అక్టోబర్ 29న నివేదిక ఇచ్చిందన్నారు. కొత్త టెండర్లు పిలవాలంటే ముందు గతంలో ఇచ్చిన టెండర్లను క్లోజ్ చేయాలని చీఫ్ ఇంజినీర్ల కమిటీ నివేదిక ఇచ్చిందన్నారు. ఈ నివేదికను ఇవాళ జరిగిన సీఆర్డీఏ సమావేశం చర్చించామని మంత్రి నారాయణ తెలిపారు. సాంకేతిక కమిటీ నివేదికలోని 23 అంశాలను పరిశీలించి పాత టెండర్లను రద్దు చేసి కొత్త టెండర్లను పిలవనున్నట్లు మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
రాజధాని అమరావతిలో వివిధ అభివృద్ధి పనుల కోసం టెండర్లు పిలుస్తున్నామని మంత్రి పి.నారాయణ తెలిపారు. అసెంబ్లీ భవనాలు, రోడ్లు, అధికారుల భవనాలు, హైకోర్టు భవనాలు, జడ్జిలు, మంత్రుల బిల్డింగ్ లకు సంబంధించి రూ.38 వేల కోట్లతో టెండర్లకు సంబంధించిన కార్యాచరణ సిద్ధమైందన్నారు. డిసెంబరు చివరి నాటికి అమరావతికి సంబంధించి అన్ని టెండర్లు పిలుస్తామన్నారు. మూడేళ్లలో రాజధాని అమరావతి పనులు పూర్తి కావాలని సీఎం చంద్రబాబు ఆదేశించారన్నారు.
అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు రూ.15 వేల కోట్ల రుణం ఇస్తుందని మంత్రి తెలిపారు. నీరుకొండ, శాఖమూరు, కృష్ణాయపాలెం వద్ద రిజర్వాయర్ల నిర్మాణం చేపడతామన్నారు. ఉండవల్లి వద్ద 7,350 క్యూసెక్కుల సామర్థ్యంతో వాటర్ పంపింగ్ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.