Army Recruitment Rally 2024 : కడపలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ, నవంబర్ 10 నుంచి 15 వరకు- ఈ 13 జిల్లాల అభ్యర్థులకే
19 October 2024, 16:05 IST
Army Recruitment Rally 2024 : వైఎస్ఆర్ జిల్లాలోని కడపలో అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. నవంబర్ 10 నుంచి 15 వరకు ఆర్మీ ర్యాలీ జరుగుతుందని అధికారులు తెలిపారు. అయితే 13 జిల్లాల వారికే ఈ ర్యాలీలో పాల్గొనే అవకాశం ఉందని పేర్కొన్నారు.

కడపలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ, నవంబర్ 10 నుంచి 15 వరకు- ఈ 13 జిల్లాల అభ్యర్థులకే
ఆర్మీలో చేరాలనుకునే వారికి గుడ్ న్యూస్. నవంబర్ 10 నుంచి 15 వరకు కడప జిల్లాలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు. కడప డీఎస్ఏ స్టేడియంలో నవంబర్ 10 నుంచి 15 వరకు అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆర్మీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. కర్నూలు, నెల్లూరు, అనంతపురం, వైఎస్ఆర్, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, తిరుపతి, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాల అభ్యర్థులు మాత్రమే ఈ ర్యాలీలో పాల్గొనేందుకు అర్హులు.
అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, ఆఫీసు అసిస్టెంట్/స్టోర్ కీపర్ టెక్నికల్, అగ్నివీర్ ట్రేడ్‌మెన్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు. అగ్రివీర్ ట్రేడ్స్ మన్ కు 8వ తరగతి అర్హత. మిగతా పోస్టులకు 10వ తరగతి అర్హత. ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ పూర్తి పారదర్శకంగా జరుగుతుందని, దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని అధికారులు సూచించారు. ర్యాలీకి హాజరయ్యే అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ https://joinindianarmy.nic.in/ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అలాగే ర్యాలీకి వచ్చినప్పుడు సంబంధిత సర్టిఫికెట్లు తీసుకురావాలని సూచించారు.
కడపలో
కడపలోని స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో అగ్నివీర్ అభ్యర్థుకు ఫిజికల్ టెస్ట్‌లు నిర్వహించనున్నారు. ఈ ఫిజికల్ టెస్ట్‌కు కర్నూలు, నెల్లూరు, అనంతపురం, కడప, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, బాపట్ల, నంద్యాల, తిరుపతి, అన్నమయ్య, సత్యసాయి జిల్లాలకు చెందిన అభ్యర్థులు హాజరుకానున్నారు. ఇప్పటికే ఆర్మీ ర్యాలీ నిర్వహణకు సంబంధించిన మౌలిక ఏర్పాట్లు పూర్తి చేశారు. ఫిజికల్ టెస్ట్‌కు హాజరయ్యే అభ్యర్థులకు సదుపాయాలను కల్పించడంలో కడప నగర పాలక సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. ఇంజినీరింగ్ అధికారుల సమన్వయంతో మైదానంలో రిక్రూట్‌మెంట్ బోర్డు విధివిధానాలకు అనుగుణంగా టెంట్లు, బారికేడ్లు, విద్యుత్, తాగునీరు, టాయిలెట్స్ తదితర మౌలిక ఏర్పాట్లను సమకూర్చుతున్నారు.
అభ్యర్థుల ఫిజికల్ టెస్ట్‌లో భాగంగా 1,600 మీటర్ల రన్నింగ్ నిర్వహిస్తారు. రన్నింగ్‌లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఇతర ఈవెంట్లు, పరీక్షలు, డాక్యుమెంట్ పరిశీలన ఉంటాయి. ఈ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి అభ్యర్థులు భారీగా హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. రోజుకూ వెయ్యి మంది చొప్పున అభ్యర్థులకు ఎంపిక చేసే అవకాశం ఉంది. ఈ ర్యాలీలో ఎంపికైన అభ్యర్థులకు ఆర్మీలో అగ్నివీర్ శిక్షణ ఇస్తారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, ఆఫీస్ అసిస్టెంట్, స్టోర్ కీపర్ టెక్నికల్ విభాగాల్లో ఎంపికైన అభ్యర్థులు పనిచేయాల్సి ఉంటుంది. అగ్నివీర్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణత, ఎనిమిదో తరగతి పాస్ అయిన అభ్యర్థులను అగ్నివీర్ ట్రేడ్ మ్యాన్ పోస్టులు ఎంపిక చేస్తారు.