Aadhaar Special Camps : ఏపీలో అక్టోబర్ 22 నుంచి 'ఆధార్' ప్రత్యేక క్యాంపులు
17 October 2024, 16:43 IST
- Aadhaar special Camps in AP : రాష్ట్రంలో అక్టోబర్ 22 నుంచి 25 వరకు ఆధార్ ప్రత్యేక క్యాంపులను నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. క్షేత్రస్థాయిలో ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు తగిన చర్యలు చేపట్టాలని సూచించింది.
ఆధార్ ప్రత్యేక క్యాంపులు
ఆధార్ ప్రత్యేక కాంపులపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు ఇచ్చింది. గ్రామ వాలంటీర్, వార్డు వాలంటీర్ అండ్ గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం (జీవీడబ్ల్యూవీ&వీఎస్‌డబ్ల్యూఎస్) డిపార్ట్‌మెంట్ ఈ క్యాంపులను నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర జీవీడబ్ల్యూవీ అండ్ వీఎస్‌డబ్ల్యూఎస్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ ఎం. శివప్రసాద్… అన్ని జిల్లాల కలెక్టర్లకు, జీవీడబ్ల్యూవీ అండ్ వీఎస్‌డబ్ల్యూఎస్ ఇన్‌ఛార్జ్‌లకు లేఖ రాశారు.
సచివాలయాలు, కాలేజీలు, స్కూల్స్, అంగన్‌వాడీ సెంటర్ తదితర వాటిల్లో అక్టోబర్ 22 నుంచి అక్టోబర్ 25 వరకు నాలుగు రోజుల పాటు ఆధార్ ప్రత్యేక క్యాంప్‌లు నిర్వహించాలని ఆదేశించారు. మండల పరిషత్ డవలప్‌మెంట్ ఆఫీసర్లు (ఎంపీడీఓ)లు, మున్సిపల్ కమిషనర్లు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. తప్పనిసరి ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ పెండింగ్‌కు సంబంధించి యూఐడీఏఐ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా… ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
జీవీడబ్ల్యూవీ అండ్ వీఎస్‌డబ్ల్యూఎస్ సచివాలయాల్లో 2,950 ఆధార్ సేవా కేంద్రాలను (ఏఎస్‌కే) ఏర్పాటు చేసినట్లు శివప్రసాద్ తెలిపారు. కొత్త ఆధార్ ఎన్‌రోల్‌మెంట్, తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్‌లు, డెమోగ్రాఫిక్ అప్‌డేట్, ఈ-ఆధార్ వంటి మొత్తం 56 లక్షల ఆధార్ సేవలను అందించిందని పేర్కొన్నారు. యూఐడీఏఐ మార్గదర్శకాల ప్రకారం 5 సంవత్సరాల తరువాత, 15 సంవత్సరాల తరువాత వయస్సు పిల్లలకు తప్పనిసరిగా వారి బయోమెట్రిక్‌ను అప్‌డేట్ చేసుకోవాలి.
యూఐడీఏఐ సూచన ప్రకారం…. రాష్ట్రంలో దాదాపు 45,58,854 తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. వంద శాతం తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్‌లు, కొత్త ఎన్‌రోల్‌మెంట్ (వయస్సు 0-5)లను చేయడానికి ఆధార్ ఆపరేటర్ల ద్వారా సచివాలయాలు, పాఠశాలలు, కాలేజీలు, అంగన్‌వాడీ కేంద్రాలలో ఆధార్ ప్రత్యేక కేంద్రాలను నిర్వహించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.