In-flight birth: సింగపూర్ విమానంలో పండంటి బిడ్డను ప్రసవించిన విజయవాడ యువతి, చెన్నై ఆస్పత్రికి తరలింపు
23 August 2024, 10:36 IST
- In-flight birth: కాన్పు కోసం సింగపూర్ నుంచి పుట్టింటికి బయల్దేరిన విజయవాడ యువతికి విమానంలో నొప్పులు రావడంతో, అదే విమానంలో ప్రయాణిస్తున్న మరో వైద్యురాలు పురుడుపోశారు. విమాన ప్రయాణంలో ఆ యువతి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. చెన్నై విమానాశ్రయంలో ఫ్లైట్ దిగిన తర్వాత ఆస్పత్రికి తరలించారు.
సింగపూర్ విమానంలో విజయవాడ యువతికి ప్రసవం
In-flight birth: విమాన ప్రయాణంలో ఓ మహిళ పండంటి బిడ్డను ప్రసవించింది. నెలలు నిండటంతో పుట్టింటికి కాన్పు కోసం బయల్దేరిన విజయవాడకు చెందిన యువతికి ప్రయాణంలో ఉండగానే నొప్పులు వచ్చాయి. అప్రమత్తమైన ఫ్లైట్ సిబ్బంది ప్రయాణికుల్లో ఉన్న వైద్య సిబ్బందిని సాయం కోరారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న ఓ మహిళా వైద్యురాలు స్పందించి యువతికి పురుడు పోసింది.
సింగపూర్ నుంచి చెన్నై వస్తున్న విమానంలో ఈ ఘటన జరిగింది. గురువారం రాత్రి చెన్నై బయల్దేరిన విమానంలో విజయవాడకు చెందిన నిండు గర్భిణీ ఉన్నారు. బుధవారం అర్ధరాత్రి సింగపూర్ నుంచి 179 మంది ప్రయాణికులతో ఇండిగో ఎయిర్లైన్స్ విమానం చెన్నై బయల్దేరింది. అదే విమానంలో ప్రయాణిస్తున్న విజయవాడకు చెందిన దీప్తి (28) అనే యువతికి హఠాత్తుగా ప్రసవ నొప్పులు ప్రారంభం అయ్యాయి.
ఆమెతో పాటు ఉన్న కుటుంబసభ్యులు ఎయిర్ హోస్టెస్‌కు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది అప్రమత్తం అయ్యారు. విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసే పరిస్థితి లేకపోవడంతో కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు. విమాన ప్రయాణికుల్లో వైద్యులు ఉంటే సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
అదే విమానంలో ప్రయాణిస్తున్న ఓ మహిళా డాక్టర్ దీప్తికి విమాన సిబ్బంది సాయంతో పురుడు పోయడంతో మగబిడ్డ జన్మించాడు. ఇండిగో విమానం తెల్లవారుజామున 4.30కు చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. అప్పటికే పైలట్ అప్రమత్తం చేయడంతో విమానాశ్రయం రన్‌వే పై అంబులెన్స్‌ను సిద్ధంగా ఉంచారు. ఫ్లైట్ ల్యాండ్ అయిన వెంటనే తల్లీ బిడ్డను థౌజండ్ లైట్స్ ప్రాంతంలో ఉన్న అపోలో ఆసుపత్రికి తరలించారు.
విజయ వాడకు చెందిన దీప్తి(28) కుటుంబం సింగపూర్లో ఉంటోంది. ఆమె నిండు గర్భిణి కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి చెన్నై మీదుగా విజయవాడకు బయల్దేరారు. ప్రసవం తర్వాత తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్టు ధృవీకరించారు. ప్రసవం తర్వాత దీప్తి కుటుంబ సభ్యులు తోటి ప్రయాణికులకు చాక్లెట్లు పంచి కృతజ్ఞతలు తెలిపారు.