తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Amaravati Electricity : అమరావతి ప్రాంత ప్రజలకు గుడ్‌న్యూస్.. ఇకనుంచి నిరంతరాయంగా విద్యుత్తు.. 8 ముఖ్యాంశాలు

Amaravati Electricity : అమరావతి ప్రాంత ప్రజలకు గుడ్‌న్యూస్.. ఇకనుంచి నిరంతరాయంగా విద్యుత్తు.. 8 ముఖ్యాంశాలు

07 November 2024, 13:10 IST

google News
    • Amaravati Electricity : అమరావతి ప్రజలకు అంతరాయం లేని విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. తాజాగా సీఎం చంద్రబాబు జీఐఎస్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. భవిష్యత్తులో డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్తు సరఫరాకు చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు చెబుతున్నారు.
అమరావతిలో గ్యాస్‌ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్‌
అమరావతిలో గ్యాస్‌ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్‌ (@AP_CRDANews)

అమరావతిలో గ్యాస్‌ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్‌

అమరావతి ప్రాంతం తాళ్లాయపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. జీఐఎస్ సబ్‌స్టేషన్‌ను చంద్రబాబు ప్రారంభించారు. తొలిసారిగా గ్యాస్‌ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. జీఐఎస్ ద్వారా అమరావతికి అంతరాయం లేని విద్యుత్ సరఫరా జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. తాడేపల్లి, నేలపాడులో సబ్‌స్టేషన్లు అప్‌గ్రేడ్‌ చేశారు. దీనికి సంబంధించి 8 ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.

1.అమరావతిలో అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్తు సరఫరా కోసం నిర్మించిన 400/220కేవీ గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ సబ్‌స్టేషన్‌ ప్రారంభమైంది.

2.ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా ఈ కేంద్రాన్ని అమరావతి ప్రాంతంలోని తాళ్లాయపాలెంలో.. ట్రాన్స్‌మిషన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ లిమిటెడ్‌ ఏర్పాటు చేసింది.

3.రాజధాని ప్రాంతానికి ఇప్పటివరకు 220/132/33 కేవీ తాడికొండ కేంద్రం నుంచి విద్యుత్తు సరఫరా అవుతోంది. భవిష్యత్తులో డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్తు సరఫరాకు ఇప్పట్నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు.

4.ప్రస్తుతం తాళ్లాయపాలెం వద్ద నిర్మించిన 400/220 కేవీ విద్యుత్తు కేంద్రం పక్కనే 220/33 కేవీ విద్యుత్తు కేంద్రాన్ని నిర్మించాలని నిర్ణయించారు.

5.తాళ్లాయిపాలెం నుంచి నేలపాడులో నిర్మించే 220/33 కేవీ విద్యుత్తు కేంద్రానికి సరఫరా చేస్తారు. తాడేపల్లిలోని 132 కేవీ కేంద్రాన్ని 220కేవీగా అప్‌గ్రేడ్‌ చేసి తాళ్లాయపాలెం జీఐఎస్‌ నుంచి సరఫరా తీసుకుంటారు.

6.ఈ కేంద్రాల ద్వారా రాజధానిలోని అన్ని ప్రాంతాలకు విద్యుత్తు సరఫరా అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తాడికొండ విద్యుత్తు కేంద్రానికి ఇవి ప్రత్యామ్నాయం కానున్నాయి.

7.తాడికొండ, తాళ్లాయపాలెం 220/33 కేవీ విద్యుత్తు కేంద్రాల నుంచి రాజధాని ప్రాంతానికి విద్యుతు సరఫరాలో అంతరాయం లేకుండా చూస్తారు.

8.తాడేపల్లి,తుళ్లూరు, మంగళగిరి మండలాలు, గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాల తోపాటు పరిశ్రమలకూ అంతరాయం లేని విద్యుత్తు సరఫరాకు ఇది తోడ్పడుతుంది. తాళ్లాయపాలెం జీఐఎస్‌ కేంద్రం నుంచి రాజధాని అమరావతిలో నిర్మించబోయే 220/33 కేవీ విద్యుత్తు సబ్ స్టేషన్లకు కరెంట్ సరఫరా చేస్తారు.

తదుపరి వ్యాసం