AP Free Gas Cylinder : ఉచిత సిలిండర్ల పథకంపై షర్మిల కీలక కామెంట్స్.. 7 ముఖ్యాంశాలు
02 November 2024, 16:34 IST
- AP Free Gas Cylinder : ఏపీలో ఉచిక గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకం ప్రారంభం అయ్యింది. సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాలో దీన్ని ప్రారంభించారు. అయితే.. ఈ స్కీమ్, కరెంటు బిల్లులను లింక్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. తాజాగా వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు.
షర్మిల
ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తూ పేద కుటుంబాల్లో దీపం పెట్టామని.. టీడీపీ, బీజేపీ, జనసేన గఫ్ఫాలు కొట్టుకుంటున్నాయని వైఎస్ షర్మిల విమర్శించారు. విద్యుత్ సర్దుబాటు ఛార్జీలతో మరోవైపు వాతలు పెడుతున్నారని ఆరోపించారు. ఒక చేత్తో ఇచ్చి.. మరో చేత్తో లాక్కోవడం అంటే ఇదేనని షర్మిల వ్యాఖ్యానించారు.
షర్మిల చెప్పిన 7 ముఖ్యాంశాలు..
1.ఉచిత సిలిండర్ల పథకం కింద ఏడాదికి ఇచ్చేది రూ.2685 కోట్లు.. ప్రజల దగ్గర నుంచి కరెంటు బిల్లుల రూపంలో ముక్కుపిండి అదనంగా వసూలు చేసేది రూ.6వేల కోట్లు. ఇంకా రూ.3 వేల కోట్లు ప్రజలపైనే అదనపు భారం పడుతుంది.
2.దీపం - 2 కింద వెలుగులు పక్కన పెడితే.. కరెంటు బిల్లుల రూపంలో కుటుంబాల్లో కూటమి ప్రభుత్వం కారు చీకట్లు నింపుతోంది.
3.గత వైసిపి చేసిన పాపమే ఇదని, ఈ ప్రభుత్వానికి సంబంధం లేదని, బిల్లుల వసూళ్లకు అనుమతి ఇచ్చింది ఈపీఈఆర్సీ తప్ప.. మేము కాదని, చెప్తున్నవి కుంటి సాకులు తప్ప మరోటి కాదు.
4.గత ప్రభుత్వం 9 సార్లు చార్జీలు పెంచిందని, తాము అధికారంలోకి వచ్చాక.. ఒక్క రూపాయి కూడా అదనపు భారం మోపమని, అవసరం అయితే 35 శాతం ఛార్జీలు తగ్గిస్తామని హామీలు ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
5.వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో 9 సార్లు చార్జీలు పెంచితే, మీరూ మొదలుపెట్టారు కదా. మీకు వాళ్లకు ఏంటి తేడా ? 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం రూ.35 వేల కోట్లు ప్రజలపై భారం మోపితే, మీరు కూడా భారం మోపడం మొదలు పెట్టారు కదా. మీకు వాళ్లకు ఏంటి తేడా.
6.రూ.6వేల కోట్లు ప్రజలపై మోపడం భావ్యం కాదు. బీజేపీ కి మద్దతు ఇస్తున్నారు కదా.. సాయం తీసుకురండి. ప్రభుత్వమే ఈ భారం మోయాలని డిమాండ్ చేస్తున్నాం.
7.ప్రజలపై సర్దుబాటు ఛార్జీల భారాన్ని మోపినందుకు నిరసనగా ఈ నెల 5 న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిస్తుంది. అని షర్మిల ట్వీట్ చేశారు.
'ఎన్నికల సందర్భంగా ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ఒకటైన ఏడాదికి 3 ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు అందించే పథకాన్ని శ్రీకాకుళం జిల్లా, ఈదుపురంలో ప్రారంభించడం సంతోషంగా ఉంది. ఉచిత వంటగ్యాస్ సిలిండర్ అందుకున్న మహిళల కళ్లలో ఆనందం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. ఈదుపురంలో ఇలా ఉచిత గ్యాస్ సిలిండర్ అందుకున్న శాంతమ్మ, నేను గతంలో ప్రవేశ పెట్టిన దీపం 1 స్కీమ్ లో గ్యాస్ కనెక్షన్ అందుకున్న మహిళ అని తెలియడం నాకు మరింత సంతోషాన్ని కలిగించింది' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
'నేను స్వయంగా ఆ వంటగదికి వెళ్లి గ్యాస్ వెలిగించి టీ పెట్టి నా సహచరులకు ఇచ్చాను. ఉచిత వంట గ్యాస్ సిలిండర్ పథకం లబ్దిదారులకు నా శుభాకాంక్షలు. వంటగదిలో ఇక పొగ కష్టం, ఆర్థిక భారం ఉండకూడదని ఎంతో మంది మహిళల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకురావాలనేదే నా ఆకాంక్ష. స్త్రీమూర్తులకు, ఆడబిడ్డలకు సాయం చేయడంలో ఎప్పుడూ ముందుటాను. వారి సంతోషం, ఆశీర్వాదాన్ని మించింది ఏముంటుంది?' అని సీఎం సంతోషం వ్యక్తం చేశారు.