SCR Special Trains : ప్రయాణికులకు గుడ్ న్యూస్ ... విశాఖ - విజయవాడ మధ్య 16 జన్‌సాధారణ్ ప్రత్యేక రైళ్లు, ఇవిగో వివరాలు
01 November 2024, 16:02 IST
- ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వే అధికారులు కీలక అప్డేట్ ఇచ్చింది. విజయవాడ - విశాఖ రూట్ లో ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.16 జన్‌సాధారణ్ (అన్ రిజర్వుడ్) రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించారు. నవంబర్ 1వ తేదీ నుంచి ఈ స్పెషల్ ట్రైన్స్ అందుబాటులోకి వచ్చాయి.
16 జన్‌సాధారణ్ రైళ్లు - దక్షిణ మధ్య రైల్వే ప్రకటన
ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అప్డేట్ ఇచ్చింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. విశాఖపట్నం- విజయవాడ మధ్య 16 జన్‌సాధారణ్ (అన్ రిజర్వుడ్) రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. నవంబర్ 1 నుంచి ఈ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు రైల్వేశాఖ వివరాలను పేర్కొంది.
విశాఖ - విజయవాడ జన్‌సాధారణ్ ఎక్స్‌ప్రెస్ (08567) రైలు నవంబర్ 1,3,4,6,8,10,11,13 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఇది విశాఖపట్నం ఉదయం 10 గంటలకు బయల్దేరి సాయంత్రం 4 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. ఇక విజయవాడ-విశాఖ ప్రత్యేక రైలు (08565) విజయవాడలో సాయంత్రం 6.30 గంటలకు బయల్దేరుతుంది. రాత్రి 12.35 గంటలకు విశాఖ చేరుకోనుంది. మొత్తం ఎనిమిది సర్వీసులు విజయవాడవైపునకు రాగా.. మరో 8 సర్వీసులు విశాఖపట్నం వైపు వెళ్తాయి. మొత్తం 16 ప్రత్యేక సర్వీసులు రాకపోకలు కొనసాగిస్తాయని అధికారులు తెలిపారు.
29 ప్రత్యేక రైళ్లు:
దీపావళి పండగ వేళ ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది. అయితే ఇవాళ విజయవాడ డివిజన్ పరిధిలో 29 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
తిరుపతి - అకోలా, తిరుపతి - కాచిగూడ, కాకినాడ - లింగంపల్లి, తిరుపతి - సోలాపూర్, హైదరాబాద్ - గోరఖ్ పూర్, సికింద్రాబాద్ - బరంపుర్, నర్సాపూర్ - బెంగళూరు, నాందేడ్ - ఏరోడ్, సికింద్రాబాద్ - సంత్రగాచి, సికింద్రాబాద్ - పాట్నా, కాచిగూడ - నాగర్ కోల్ మధ్య ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.
సికింద్రాబాద్ నుంచి శబరిమలకు ప్రత్యేక రైలు:
శబరిమల వెళ్లే భక్తుల కోసం రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ గౌరవ్ పేరుతో ప్రత్యేక రైలును నడుపుతోంది. మొత్తం 4 రాత్రులు, 5 పగళ్ల ప్యాకేజీతో ఈ రైలును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ట్రైన్ నవంబర్ 16న సికింద్రాబాద్‌లో బయలుదేరి పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, ఒంగోలు, గూడూరు మీదుగా శబరిమల అయ్యప్ప చోట్టనిక్కర దేవి ఆలయానికి చేరుతుంది. 20వ తేదీన తిరుగు ప్రయాణం అవుతుంది.
ధరల వివరాలు…
టీ, టిఫిన్, భోజనం, ఏపీ, నాన్ ఏసీ, ప్రయాణికులకు బీమాతో కలిపి టికెట్ ధర ఒక్కొక్కరికి స్లీపర్ క్లాసులో రూ.11,475, థర్డ్ ఏసీలో రూ.18,790, సెకెండ్ ఏసీలో రూ.24,215 గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు 82879 32312, 92814 95848 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని రైల్వే అధికారులు వివరించారు. అయ్యప్ప భక్తులు ఈ సర్వీసును వినియోగించుకోవాలని సూచించారు.
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని.. మరిన్ని ప్రత్యేక రైళ్లు నడిపే అవకాశం ఉందని రైల్వే అధికారులు చెబుతున్నారు. గతంలోనూ శబరిమలకు పలు ప్రత్యేక రైళ్లను నడిపారు. ముఖ్యంగా మకర జ్యోతి దర్శనం సమయంలో శబరిమలకు ఎక్కువ మంది వెళ్తుంటారు. వారి కోసం నవంబర్ నెల ఎండింగ్ నుంచి డిసెంబర్, జనవరి నెలలో స్పెషల్ ట్రైన్లను నడిపే అవకాశం ఉంది.